Amaravati: తుఫాన్ ముంచెత్తినా తాడేపల్లి ప్యాలెస్ వదలని సీఎం జగన్

మిచౌంగ్ తుఫాన్ విపత్తుపై సీఎం జగన్ నిర్లక్ష్యం వహిస్తున్నారని శాసనమండలి పక్షనేత యనమల రామకృష్ణుడు విమర్శించారు....

Update: 2023-12-06 17:26 GMT

దిశ, ఏపీ బ్యూరో: మిచౌంగ్ తుఫాన్ విపత్తుపై సీఎం జగన్ నిర్లక్ష్యం వహిస్తున్నారని శాసనమండలి పక్షనేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. తుఫాన్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లి రైతులు ఆందోళన చెందుతున్నా జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌ను వదలడం లేదన్నారు. తుఫానుపై వారం నుంచే హెచ్చరికలున్నా అధికార యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేయడంలో జగన్ రెడ్డి విఫలమయ్యారన్నారు. బాధిత ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన ఆహారం, పునరావసంతో పాటు చివరకు మంచినీళ్లు కూడా సరఫరా చేయలేక చేతులెత్తేశారని ఆరోపించారు. తుఫానుపై తూతూ మంత్రంగా సమీక్ష చేసి చేతులు దులుపుకున్నారని యనమల మండిపడ్డారు.

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడపాల్సిన పరిస్థితి ఉంటే జగన్ ప్యాలెస్‌ను కూడా వీడడంలేదని యనమల విమర్శించారు. అంతేకాకుండా వ్యవసాయ, సాగునీటి శాఖల మంత్రులు గానీ ప్రజల, రైతుల గోడు వినే పరిస్థితి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు రూ.7 వేల కోట్ల విలువైన పంట ఉత్పత్తులను రైతులు కోల్పోయారన్నారు. ప్రధానంగా కోత దశలో ఉన్న వరి తీవ్రంగా దెబ్బతినిందన్నారు. పొగాకు, పత్తి, మిర్చి, శనగ, అరటి, బొప్పాయి, మినుము, అపరాల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, 8 జిల్లాల్లో తుఫాను తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ముంపు ప్రాంతాల్లో ఇంటికో భోజనం పొట్లం ఇచ్చి సరిపెట్టుకోమనడం జగన్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. పలు చోట్లా బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంలో నిర్లక్ష్యం చూపారన్నారు. విద్యుత్ ను పునరుద్ధరించడంలోనూ విఫలమయ్యారని మండిపడ్డారు. ఇప్పటికైనా తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవడంతో పాటు..బాధితులకు అండగా నిలవాలని, మారిన పరిస్థితులకు అనుగుణంగా పరిహారం పెంచి ఇవ్వాలని, అదే క్రమంలో తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని యనమల డిమాండ్ చేశారు.

Tags:    

Similar News