Cm Jagan: టీడీపీ నేత బీటెక్ రవికి ఝలక్.. దెబ్బతో కీలక నిర్ణయం
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి వైసీపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది..
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి వైసీపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బీటెక్ రవికి భద్రత తొలగించింది.. బీటెక్ రవి గన్‌మెన్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో ఇద్దరు గన్‌మెన్లు వెనక్కి రావాలని వైఎస్ఆర్ కడప జిల్లా పోలీసు అధికారులు సిబ్బందిని ఆదేశించారు. భద్రత తొలగించడంపై ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గన్‌మన్లను పిలిపించడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
మార్చి 29తో ముగిసిన బీటెక్ రవి ఎమ్మెల్సీ పదవీకాలం
కాగా బీటెక్ రవి ఎమ్మెల్సీ పదవీకాలం ఈ ఏడాది మార్చి 29తో ముగిసింది. బీటెక్ రవి పదవీకాలం ముగియడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే బీటెక్ రవి మాత్రం భద్రతను తగ్గించడంపై మండిపడుతున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో టీడీపీ ముఖ్య నేతల్లో బీటెక్ రవి ఒకరు. అతేకాదు సీఎం జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల ఇన్‌చార్జిగా కూడా పని చేస్తున్నారు.
వివేకా హత్య కేసులో తొలుత బీటెక్ రవిపై ఆరోపణలు
మరోవైపు వైఎస్ వివేకా హత్యకేసులో తొలుత బీటెక్ రవిపైనా ఆరోపణలు వెలువడ్డాయి. సీబీఐ, సిట్ విచారణలను సైతం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మంగళవారం చంద్రబాబు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇలాంటి తరుణంలో బీటెక్ రవి భద్రత తొలగించడం చర్చనీయాంశంగా మారింది.