Big Breaking: వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ధిక్కరించారని నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ అధిష్టానం చర్యలు చేపట్టింది...
దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ధిక్కరించారని నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ అధిష్టానం చర్యలు చేపట్టింది. నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. క్రాస్ ఓటింగ్‌పై అంతర్గతంగా విచారణ చేపట్టామన్నారు. క్రాస్ ఓటింగ్ కు పాల్పడినందుకు నలుగురిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దర్యాప్తు తర్వాతే వేటు వేశామని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
కాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 6 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. మరో స్థానాన్ని టీడీపీ గెలిచింది. అయితే టీడీపీకి ఈ నలుగురు ఓటు వేశారని వైసీపీ అధిష్టానం గుర్తించింది.
మరోవైపు ఈ నలుగురు ఎమ్మెల్యేలు కొంతకాలంగా పార్టీ అధిష్టానం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధిపై స్వయంగా పార్టీ అధిష్టానంపై విమర్శలు చేశారు. అయితే సీఎం జగన్ కలుగజేసుకుని సర్ది చెప్పాలని ప్రయత్నం చేశారు. పిలిచి మాట్లాడిన తర్వాత కూడా ఈ నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉన్నారు. దీంతో ఈ నలుగురి నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జులను సీఎం జగన్ నియమించారు. ఈ వ్యవహారంలో ఈ నలుగురి ఎమ్మెల్యేల అసంతృప్తి తీవ్రతరం అయింది.
ఇది ఇలా ఉండగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఏడు స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ఆ పార్టీ బరిలో దింపింది. అటు టీడీపీ కూడా అనూహ్యంగా పంచుమర్తి అనురాధను అభ్యర్థిగా పోటీ చేయించింది. దీంతో పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుగా పలికారు. వీరి ఓట్లు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకే పడ్డాయి. అయితే అసంతృప్తిగా ఉన్న వైసీపీ నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేశారని తేలడంతో ఆ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది.
Read more: