Mangalagiri: టీడీపీలో చేరిన వైసీపీ కీలక నేత.. చంద్రబాబు సమక్షంలో చేరిక

శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ..

Update: 2023-06-29 11:50 GMT

దిశ,డైనమిక్ బ్యూరో: శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.మంగళగిరి టీడీపీ కార్యాయలంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎస్‌సీవీ నాయుడు ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కండువాకప్పి ఎస్సీవీ నాయుడును చంద్రబాబు నాయుడు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అయితే ఎస్‌సీవీ నాయుడుతోపాటు పలువురు నేతలు సైతం టీడీపీలో చేరారు.

కాగా ఎస్‌సీవీ నాయుడు 2004లో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిపై గెలుపొందారు. 2009 ఎన్నికల్లో కూడా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరోసారి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎస్‌సీవీ నాయుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరారు. సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో శ్రీకాళహస్తి టికెట్ ఆశించి భంగపడ్డారు. దాంతో ఆయన టీడీపీకి దూరమయ్యారు. అనంతరం వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలుపునకు కృషి చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హామీ ఇచ్చారు.

అయితే ఎస్‌సీవీ నాయుడుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంతో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. అనంతరం టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే ఎస్‌సీవీ నాయుడు రాకను శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జి బొజ్జల సుధీర్ రెడ్డి వ్యతిరేకించారు. దీంతో ఇటీవలే చంద్రబాబుతో ఎస్‌సీవీ నాయుడు భేటీ అవ్వడంతో పార్టీలో చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో గురువారం చంద్రబాబు నాయుడు సమక్షంలో బొజ్జల సుధీర్ రెడ్డి నాయకత్వంలో ఎస్‌సీవీ నాయుడు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Tags:    

Similar News