AP:ఆయన కృషితోనే ఈ పథకంలో ముందడుగు.. ఎమ్మెల్యే జూలకంటి హర్షం

పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో పర్యాటక కేంద్రంగా ఉన్న నాగార్జునసాగర్(దక్షిణ విజయపురి)లో బౌద్ధ వారసత్వం, సాంస్కృతిక చిహ్నాలను సుసంపన్నం చేస్తూ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది

Update: 2025-03-29 14:46 GMT

దిశ ప్రతినిధి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో పర్యాటక కేంద్రంగా ఉన్న నాగార్జునసాగర్(దక్షిణ విజయపురి)లో బౌద్ధ వారసత్వం, సాంస్కృతిక చిహ్నాలను సుసంపన్నం చేస్తూ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. సాగర్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వంలోని.. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద 'ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్‌మెంట్' అనే ఉప పథకం కింద నాగార్జున సాగర్‌కు రూ.25 కోట్లు మంజూరు చేస్తూ, అనుమతులను ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఒకవైపు నాగార్జునసాగర్ అందాలతో, బౌద్ధ క్షేత్రం చిహ్నాలతో సాగర్ ప్రాంతం పర్యాటకులకు మంచి అనుభూతిని కలిగిస్తూ ఉంది, ఈ ప్రాంతాన్ని మరింత పర్యాటక విధంగా అభివృద్ధి జరగాలని, నిధులు మంజూరు చేయాలని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ డైరెక్టరేట్ ముందు వివరణాత్మక ప్రదర్శనను అందించింది. ఈ అభ్యర్థన మేరకు కేంద్ర పర్యవేక్షణ కమిటీ ఈ ప్రాజెక్టును ఆమోదించింది.

ఈ పథకం కింద జరిగే అభివృద్ధి అంశాలు..

మంజూరైన నిధులతో నాగార్జున సాగర్ ప్రాంతంలో.. బౌద్ధ నేపథ్య ఉద్యానవనాలు, బౌద్ధ చిహ్నల కోసం కేంద్రం అభివృద్ధి, రెస్టారెంట్లు, కంపార్ట్‌మెంట్‌లతో బయో-టాయిలెట్లు, సీసీ టీవీ, నిఘా వ్యవస్థ అభివృద్ధి, వెబ్‌సైట్ అభివృద్ధి, ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్, 3D హోలోగ్రామ్ సిస్టమ్, లైవ్ ఇంటరాక్టివ్ టచ్ పట్టిక, శిక్షణలు, సెన్సిటైజేషన్ వర్క్‌షాప్‌లు, గ్రీన్ పార్క్ లు వంటివి అభివృద్ధి చేస్తారు. ఈ పథకాన్ని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు నిర్వహిస్తారు, సంవత్సర కాలంలోనే ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలన్న కాల పరిమితిని నిర్ణయించారు.

పర్యాటక విభాగం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసే ఈ పథకాన్ని బౌద్ధ ఆనవాళ్లకు ప్రతీకగా ఉన్న నాగార్జునసాగర్ ప్రాంతానికి వర్తింప చేయాలని.. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.. సంబంధిత అధికారుల ద్వారా ప్రతిపాదనను పంపించారు. నిధులు మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఫలితంగా నేడు రూ. 25 కోట్లు మంజూరు కావడం పట్ల శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ, అత్యంత త్వరగా అభివృద్ధి జరిగేందుకు కృషి చేస్తామని వివరించారు.

Similar News