సీటుపై రాని సమాచారం.. సీఎం జగన్‌పై ఎమ్మెల్సీ డొక్కా సంచలన వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో తన పోటీపై నిర్ణయం తీసుకోవాల్సింది సీఎం జగన్ మోహన్ రెడ్డి అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ అన్నారు...
దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో తన పోటీపై నిర్ణయం తీసుకోవాల్సింది సీఎం జగన్ మోహన్ రెడ్డి అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ అన్నారు. గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి టీడీపీ తరపున పోటీ చేసి స్వల్ప తేడాతో వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరితపై ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. దీంతో ఆయనను తాడికొండ నియోజకవర్గానికి ఇంచార్జిగా నియమించారు.
ప్రస్తుతం సీఎం జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గాల ఇంఛార్జుల మార్పు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాడికొండ నియోజకవర్గం ఇంచార్జి బాధ్యతలు తన ప్రత్యర్థి మేకతోటి సుచరితకు అప్పగించారు. దీంతో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ సారి ఎన్నికల్లో డొక్కా మాణిక్య వర ప్రసాద్‌కు సీఎం జగన్ ఇవ్వరంటూ ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో స్వయంగా డొక్కా మాణిక్య ప్రసాద్ స్పందించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఎన్నికల్లో పోటీపై అధిష్టానం నుంచి తనకు ఎలాంటి సమాచారం రాలేదని తెలిపారు. అలా అని సీటు కోసం తాను ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని తెలిపారు. సీటు గురించి తాను ఎవ్వరినీ అడగనని, ఇప్పటి వరకూ అడగలేదని చెప్పారు. అలా అని తన వద్ద ఎలాంటి ప్రణాళికలు కూడా లేవని స్పష్టం చేశారు. భగవంతుడిని వేడుకోవడం తప్ప మరో దారి లేదని డొక్కా మాణిక్య వర ప్రసాద్ పేర్కొన్నారు.