పట్టా పుస్తకాలపై జగన్ ఫొటో...ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పట్టా పుస్తకాల రంగు మారాయి..
దిశ, వెబ్ డెస్క్: జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పట్టా పుస్తకాల రంగు మారాయి. వాటికి ఉండాల్సిన ప్రభుత్వ ముద్ర కూడా మారింది. అంతేకాదు రైతుల పొలాల్లో హద్దు రాళ్లు వెలిశాయి. వాటిపై జగన్ ముఖచిత్రం మెరిసిపోతోంది. ఈ విషయాన్ని రైతులు చాలా వేదికల వద్ద లేవనెత్తినా పట్టించుకున్న నాధుడు లేడు.. పట్టా పుస్తకాలపై జగన్ ఫొటో తీసిన వాళ్లు లేరు. అసలు ఆ వైపు చూసిన అధికారులు కూడా లేరు. ప్రతిపక్షాల విమర్శలను లెక్క చేసిన వాళ్లే లేరు. అయితే ఇప్పుడు ఈ అంశం జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చింది. అది కూడా తీసుకొచ్చింది న్యాయవాదులు. మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్‌ను న్యాయవాదులు కలిశారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన భూ హక్కు చట్టం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై పవన్ కల్యాణ్‌కు న్యాయవాదులు వివరించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది డ్రెకోనియన్ లా అని అన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. రుషికొండను దోచుకున్న మాదిరిగా ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను కూడా దోచుకునే ప్రయత్నానికి తెర లేపారని మండిపడ్డారు. ఈ అంశాల్ని సామాన్యుల నుంచి గృహిణిల వరకు అర్ధమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. మరింత లోతుగా అందరికీ చెప్పడానికి రెండు రోజులు ఈ యాక్టును పరిశీలిస్తానని చెప్పారు. లీగల్ అవగాహన లేని వాళ్లకు సామన్య భాషలో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఐదుగురు వ్యక్తులు కమిటీగా ఏర్పడితే ఈ చట్టంతో కలిగే నష్టాలపై చర్చిస్తానన్నారు. ఆ తర్వాత భారీ బహిరంగ సభ పెట్టి అందిరికీ వివరిస్తా. ఈ చట్టాన్ని అమలు కాకుండా చూసే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. జనసేన పక్షాన న్యాయవాదుల ఆందోళనకు మద్దతు ఇస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
కాగా విజయవాడ, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు, పలువురు సభ్యులు, సినియర్ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. వైసీపీ ప్రభుతం తెచ్చిన చట్టం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్‌ను పలువురు న్యాయవాదులు కలిసి మద్దతు కోరారు. అయితే వీరి ఆందోళనకు పవన్ పూర్తి మద్దతు ప్రకటించారు. న్యాయవాదులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.