Guntur: గృహ నిర్మాణ శాఖ అవినీతిపై నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
వైసీపీ సర్కార్ రోజుకో అవినీతి కార్యక్రమం చేపడుతోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు...
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ సర్కార్ రోజుకో అవినీతి కార్యక్రమం చేపడుతోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖలో జరుగుతున్న అవినీతిపై మంగళగిరి జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగనన్న కాలనీల నిర్మాణం పేరుతో వైసీపీ సర్కార్ పేదలను వంచిస్తోందని మండిపడ్డారు. ఈ కాలనీలకు భూ సేకరణ పేరుతో అవినీతి చేస్తున్నారని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ గత ఏడాది నవంబర్లో గుంకలామ్లోని జగనన్న కాలనీని సందర్శించి వాటి పరిస్థితి చూశారన్నారు. ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్నారని అప్పుడే చెప్పారని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు.
జగనన్న కాలనీల ద్వారా లబ్ధి పొందింది జగన్, వైసీపీ ప్రజా ప్రతినిధులు మాత్రమేనని నాదెండ్ల మనోహర్ ఆరోపించరు. భూసేకరణ పేరుతో రూ.35,141 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. శాసన సభలో ముఖ్యమంత్రి చెప్పిన లెక్కలకు, ప్రభుత్వ ప్రకటనలకు పొంతన లేదన్నారు. వైసీపీ నాయకుల మధ్య వాటాల పంపకంలో గొడవలు రావడంతో అవినీతి లెక్కలు బయటకు వస్తున్నాయని చెప్పారు. గుంటూరు జిల్లాలో భయంకరంగా అవినీతి చేశారన్నారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు, ఆ పార్టీ నాయకులు, అధికారులు, చివరకు కలెక్టర్ కూడా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే ఈ భూసేకరణపై విజిలెన్స్ విచారణకు డిమాండ్ చేశారని నాదెండ్ల మనోహర్ చెప్పారు.
‘బురదల్లో, కొండల్లో, ఊరు చివర, శ్మశానాల దగ్గర భూములు ఇచ్చారు, అక్కడ కాలనీలు నిర్మిస్తామంటే ప్రజలు ఆందోళన చెందారు. అందుకే 95 వేల మంది లబ్ధిదారులు తమకు ఇళ్ల పట్టాలు వద్దు అన్నారు. భూ సేకరణపై విచారణ చేయాలి. ఎక్కడికైనా వెళ్ళి పరిశీలిద్ధాం. ఎవరి దగ్గర నుంచి భూమి సేకరించారు.. అందుకు చెల్లించిన మొత్తాలు పరిశీలిద్దాం. భూసేకరణ ప్రకటన ముందు రోజు భూమి కొంటారు. ప్రకటన వచ్చాక ఆ భూమి తీసుకుంటారు. తీసుకున్న మర్నాడే పేమెంట్ చేసేస్తారు. అసలు భూసేకరణ ఎంత పకడ్బందీగా చేయాలి?. అలాంటిదేమీ లేకుండా హడావిడిగా కానిచ్చేశారు. ఇళ్ల నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన నాలుగేళ్లలో గృహ నిర్మాణానికి ఇచ్చిన బడ్జెట్ రూ.16,815 కోట్లు. చేసిన వ్యయం రూ.8250 కోట్లు మాత్రమే. అంటే పేదల గృహ నిర్మాణానికి ఇచ్చిన బడ్జెట్లో 50శాతం మాత్రమే ఖర్చు చేశారు.’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.