Pawan Varahi Yatra: పవన్ రెండో విడత వారాహి యాత్ర అక్కడి నుంచే ఫిక్స్!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 9 నుంచి రెండో విడత వారాహి యాత్ర కొనసాగించనున్నారు....

Update: 2023-07-06 16:16 GMT

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 9 నుంచి రెండో విడత వారాహి యాత్ర కొనసాగించనున్నారు. తొలి విడత ముగిసిన తర్వాత యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన పవన్.. రెండో విడతకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయింది. జనసేన నేతలు, కార్యకర్తలతో సమీక్షించిన పవన్ కల్యాణ్ రూట్ మ్యాప్‌ను ఫైనల్ చేశారు. ఈ నెల 9న ఏలూరులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ అనంతరం ఏలూరు, దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల్లో వారాహి యాత్ర  కొనసాగే అవకాశం ఉందని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. 


ఇక పవన్ కల్యాణ్ తొలి విడత వారాహి యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. ఎక్కడ సభ పెట్టినా.. వారాహి యాత్ర నిర్వహించినా ఇసుకేస్తే రాలనంతగా ప్రజలు, జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు తరలివచ్చారు. నిండుగా కనిపించిన పవన్ సభలు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో సైతం ఆందోళన కలిగించాయి. అయితే వారాహి తొలి విడత యాత్ర మొత్తం ప్రజా సమస్యలపైనే పపన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రధానంగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగి పవన్ కల్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి చెందిన కొందరు కాపు, రెడ్డి సామాజిక వర్గం నేతలు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసి మరీ విమర్శలు చేయడంతో ఒక్కసారిగా కుల రాజకీయాలు చెలరేగాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ, కాపు సీనియర్ నేత హరి రామ జోగయ్య మధ్య మాటల యుద్ధం నడిచింది. అలా తొలి విడత వారాహి యాత్ర ముగిసింది. దీంతో రెండో విడత యాత్రపై జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. పశ్చిమగోదావరి నుంచే యాత్ర కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Tags:    

Similar News