YCP: ‘సామాజిక భేరీ’పోస్టర్ రిలీజ్‌లో మంత్రులు చేసిన కీలక వ్యాఖ్యలు ఇవే..

రాష్ట్రంలో నేటి నుంచి ‘సామాజిక భేరీ’ యాత్ర చేపడుతున్నామని మంత్రి జోగి రమేష్ అన్నారు..

Update: 2023-10-25 17:08 GMT

దిశ, ఏపీ బ్యూరో:  రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నేటి నుంచి తాము ‘సామాజిక భేరీ’ యాత్ర ద్వారా తమ ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు చెప్పుకునేందుకే చేపడుతున్నామని, నేటి నుంచి మూడు ప్రాంతాల్లో ఈ యాత్ర సాగేలా ప్రణాళికలు రూపొందించామని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సామాజిక భేరీ యాత్రకు సంబంధించిన విషయాలను మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి, మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్, ఎస్టీ సెల్‌ చైర్మన్‌ హనుమంత్‌ నాయక్‌తో కలిసి మాట్లాడారు. ముందుగా సామాజిక సాధికార యాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ రాష్ర్టంలో సామాజిక ధర్మం పాటించిన ఏకైక నాయకుడు సీఎం జగన్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి పేదలకు– పెత్తందార్లకు మధ్య జరిగే యుద్ధంలో గొంతు గొంతు కలిపి ఏకమై జగనన్నకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మూడు విడతల్లో బస్సు యాత్ర ఉంటుందని, మొదటి విడత ఇచ్ఛాపురం, తెనాలి, శింగనమల ఉంటుందని తెలిపారు.

మాది పేదల యాత్ర, వారిది జైల్లోని వ్యక్తి కోసం యాత్ర - మంత్రి మేరుగ నాగార్జున

‘మాది పేదల యాత్ర అని, వారిది జైల్లోని వ్యక్తి కోసం యాత్ర చేస్తున్నారు. మా మొదటి యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనుందని, ఈ యాత్ర అమలు కోసం రాష్ట్రాన్ని ఉత్తర, మధ్య, దక్షిణ ఆంధ్రాగా మూడు ప్రాంతాలుగా విభజించాం. దళితులపై చంద్రబాబు హయాంలో జరిగినన్ని దాడులు మరెప్పుడూ జరగలేదు. వైసీపీ పాలనలో పేదల బతుకులు మారాయి. రాష్ట్రంలో పేదరికం 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. వైసీపీ పేదల ప్రభుత్వం.’ అని మేరుగ నాగార్జున తెలిపారు.

చేసిన మేలు చెప్పుకునేందుకే యాత్ర - మంత్రి సురేష్

‘చేసిన మేలు చెప్పుకునేందుకే సామాజిక సాధికార యాత్ర చేస్తున్నాము. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు ఈ యాత్ర ద్వారా వివరించబోతున్నాం. పేదల పిల్లలకు ఇంగ్లీషు మీడియం వద్దని, ఇళ్ల పట్టాలు వద్దని, అమరావతిలో పేదలు ఉండడానికి వీల్లేదని చంద్రబాబు ప్రయత్నించారు. వారిని ఆలయాల్లోకి కూడా రానివ్వలేదు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే పేదలకు అవే ఆలయ కమిటీలలో పదవులు ఇచ్చారు. ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి తర్వాత తప్పించుకునే వ్యక్తి చంద్రబాబు. ‘‘నారా భువనేశ్వరి..చంద్రబాబు ఎన్టీఆర్‌ను ఎలాంటి వేధింపులకు గురి చేశారో చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థపై పవన్ కల్యాణ్‌ అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు.’ అని మంత్రి సురేశ్ అన్నారు.

పక్షపాతం లేకుండా సంక్షేమ పాలన - మాజీ మంత్రి కొలుసు పార్థసారథి

‘రాష్ర్టంలో తమ వైసీపీ ప్రభుత్వం ఎలాంటి పక్షపాతం లేకుండా పాలన సాగిస్తోంది. కరోనా సమయంలో తిండిలేక అనేక రాష్ట్రాల్లో ప్రజలు చనిపోయారు. కానీ జగన్ పుణ్యమా అని ఏపీలో అలాంటి పరిస్థితి రాలేదు.’ అని పార్థ సారథి వ్యాఖ్యానించారు.

ఇది పెత్తాందారులను ఎదుర్కొనే యాత్ర - మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్

‘నేటి నుంచి సీఎం జగన్ పెత్తందార్లను ఎదుర్కొనేందుకే ఈ యాత్ర చేపట్టారు. జగన్ పేదల వైపు నిలపడితే, చంద్రబాబు పెత్తందార్ల వైపు నిలబడ్డారు. ఈ యుద్దంలో పేదలు బాగుపడాలంటే జగనే మళ్లీ సీఎం కావాలి. అందుకు ప్రజలు కలిసికట్టుగా ముందుకు రావాలి.’ అని మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ పిలుపునిచ్చారు.

సామాజిక అవస్యకత కోసమే యాత్ర - ఎస్టీ సెల్‌ చైర్మన్‌ హనుమంత్‌ నాయక్‌

‘ఏపీలో వైసీపీ ప్రభుత్వం నేటి చేపట్టే యాత్ర సామాజిక ఆవస్యకత కోసమే. అనేక సంవత్సరాలుగా కులాలు, సంఘాలు, కుల దూరాభిమానాల కారణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు వెనుకబడ్డాయి. గతంలో రాజకీయ నాయకులు ఆయా వర్గాలను ఓటు బ్యాంకులా వాడుకోవడంతో ఎలాంటి అభివృద్ది, సంక్షేమ ఫలాలు వారికి అందలేదు.’ అని హనుమంత్‌ నాయక్‌ తెలిపారు.

Tags:    

Similar News