Guntur: దూకుడు తగ్గించిన గుంటూరు ఎంపీ... ఏడాది కాలంగా దూరం!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవ్‌లో హేమాహేమీలు మట్టికరిచారు. ఫ్యాన్ గాలి ముందు సైకిల్ పంక్చర్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే టీడీపీలోని మహావృక్షాలే కొట్టుకుపోయారు...
దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవ్‌లో హేమాహేమీలు మట్టికరిచారు. ఫ్యాన్ గాలి ముందు సైకిల్ పంక్చర్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే టీడీపీలోని మహావృక్షాలే కొట్టుకుపోయారు. బడా నాయకులుగా చెప్పుకునే వారు సైతం ఆ వైసీపీ ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయారు. అంతలా వైసీపీ గాలి వీస్తున్నా తట్టుకుని ఎంపీగా గెలుపొందారు. వైసీపీ ప్రభుత్వంపై ఒంటికాలితో యుద్ధానికి దిగారు. అంతకు ముందు విభజన హామీలపై లోక్‌సభ సాక్షిగా ప్రధాన మంత్రినే 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్' అని సంభోదించారు. మిస్టర్ ఫినాన్స్ మినిస్టర్ అంటూ విశ్వరూపం చూపించారు. ఈ డైలాగులతో యావత్ సభ మొత్తం ఆయన వైపు తిప్పుకునేలా చేశారు. విభజన హామీలన్నీ నెరవేరుస్తామన్న మీరు ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 14 నిమిషాల పాటు ఆంగ్లంలో అనర్గళంగా ప్రసంగిస్తూ బీజేపీకి ముచ్చెమటలు పట్టించారు. ఇంతకీ ఆ మిస్టర్ ఎంపీ ఎవరో అర్థమయ్యే ఉంటుంది కదూ..ఇంకెవరు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. గుంటూరు లోక్‌సభ నుంచి రెండుసార్లు గెలుపొందిన గల్లా జయదేవ్ తన మార్క్ రాజకీయం చేశారు. అటు లోక్‌సభలోనూ ఇటు సొంత నియోజకవర్గంలోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అమరావతి రాజధాని రైతుల పక్షాన పోరాటం చేశారు. చలో అసెంబ్లీ వంటి నిరసన కార్యక్రమాల్లో కూడా దూకుడుగా పాల్గొన్నారు. అలాంటి గల్లా జయదేవ్ ఏడాది కాలంగా కానరాకుండా పోయారు. కనీసం పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఎందుకీ రాజకీయం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. గల్లా వ్యాపారాలకు వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడంతో జయదేవ్ పాలిటిక్స్‌లో దూకుడు తగ్గించారనే ప్రచారం ఉంది. పార్లమెంట్ సమావేశాలకు అలా వెళ్లి ఇలా వచ్చేస్తున్నారు. కనీసం గుంటూరు ఛాయలకు కూడా రాకుండా హైదరాబాద్‌లోనే కాలం వెళ్లదీస్తున్నారు. పార్టీ నాయకులు సంప్రదిస్తున్నా టచ్ మీ నాట్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో గల్లా జయదేవ్ తిరిగి పోటీ చేస్తారా అన్న సందేహం నెలకొంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్సెస్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ మాత్రమేనని ప్రచారం కూడా జరుగుతుంది.
అందుకే దూరమయ్యారా?
ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల్లో ఎంత అయితే విజయవంతం అయ్యారో అటు బిజినెస్‌లోనూ సక్సెస్ అయ్యారు. సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మేన్‌గా ఉన్న ఆయనను చంద్రబాబు రాజకీయాల్లోకి ఆహ్వానించడంతో గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి రెండు సార్లు పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత దూకుడు పెంచారు. అమరావతి రైతుల పక్షాన అలుపెరగని పోరాటం చేశారు. చలో అసెంబ్లీ ప్రోగ్రాంలో కూడా హుషారుగా పాల్గొన్నారు. ఛాన్స్ దొరికితే చాలు వైసీపీ ప్రభుత్వంపైనా సీఎం జగన్‌పైనా తీవ్ర విమర్శలు చేయడం మొదలు పెట్టారు. దీంతో గల్లా జయదేవ్ రాజకీయంగా తిరుగుండదు అనుకుంటున్న తరుణంలో వైసీపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. చిత్తూరు జిల్లాలో ఉన్నఅమర్ రాజా కంపెనీ మీద వైసీపీ ప్రభుత్వం గురి పెట్టింది. భూకేటాయింపులను వెనక్కి తీసుకుంది. అలాగే కాలుష్యంపైనా కీలక ఆంక్షలు పెట్టింది. వైసీపీ ప్రభుత్వం చర్యలతో గల్లా ఫ్యామిలీ తీవ్ర మనోవేదనకు గురైనట్లు ఇప్పటికీ ప్రచారం జరుగుతుంది. ఒకానొక దశలో ఈ రాజకీయాలు మనకొద్దు అన్నంత స్టేజిలోకి వెళ్లిపోయారు. కోర్టులను ఆశ్రయించి దానిపై పోరాటం చేస్తున్నప్పటికీ రాజకీయంగా మాత్రం గల్లా జయదేవ్ దూకుడు పెంచకపోవడంతో టీడీపీలో గుబులు రేపుతోంది. ఇక రాజకీయాలకు గల్లా ఫ్యామిలీ గుడ్ బై చెబుతుందని కూడా ప్రచారం జరుగుతుండటం టీడీపీ ఉలిక్కిపడుతుంది. ఇప్పటికే టీడీపీలోని కీలక పదవులకు గల్లా అరుణకుమారి రాజీనామా చేశారు. తల్లిబాటలోనే గల్లా జయదేవ్ పయనించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇందులో భాగంగానే దాదాపు ఏడాది కాలంగా గుంటూరు లోక్‌సభకు ముఖం చూపించడం లేదని.. హైదరాబాద్ వదిలి రాష్ట్రానికి రావడం లేదని తెలుస్తోంది. అయితే టీడీపీ అధినాయకత్వం మాత్రం గల్లాను వదులుకోవడానికి ఇష్టపడడంలేదు. అర్ధబలం అంగబలంతో పాటు రాజకీయ పరపతి.. మంచి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న గల్ల జయదేవ్‌లాంటి వారు పార్టీలో ఉంటే ఏంతో మేలని టీడీపీ ఆలోచిస్తుంది. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గల్లా జయదేవ్ పోటీ చేస్తారా అనేదానిపై ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
వైసీపీ బెదిరింపులవల్లే సైలెంట్: మాజీమంత్రి పితాని
వైసీపీ ప్రభుత్వ బెదిరింపులే ఎంపీ గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికలలో దూరంగా ఉంటానని అనడానికి కారణమని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ వెల్లడించిన సంగతి తెలిసిందే. కార్పోరేట్ సంస్థ ప్రతినిధి కావడంతో జయదేవ్‌ను బెదిరిస్తున్నారని పితాని సత్యనారాయణ ఆరోపించారు. ఇదే రౌడీయిజం కొనసాగితే పరిశ్రమలే కాదు రాజకీయ నాయకులు దూరమయ్యే ప్రమాదముందని అన్నారు. వ్యాపార రంగంలో దిగ్గజాలుగా ఉన్న వ్యక్తులను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని అన్నారు. అటు రాజకీయంగా దెబ్బకొట్టేందుకు కంపెనీలపై వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఈ విధానం సరికాదని మాజీమంత్రి పితాని సత్యనారాయణ చెప్పుకొచ్చారు.
మెత్తబడినట్లేనా?
రాజకీయాలపట్ల అంటీముట్టనట్లుగా ఎంపీ గల్లా జయదేవ్ వ్యవహరిస్తుండటాన్ని పార్టీ సైతం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అమర్ రాజా కంపెనీకి సంబంధించి భూ కేటాయింపులు, ఇతర అంశాలపై వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో గల్లా ఫ్యామిలీ ఉక్కిరిబిక్కిరి అయ్యారని తెలుస్తోంది. ఈ పరిణామాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని గల్లా జయదేవ్ ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఈ అంశంపై గల్లా జయదేవ్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంప్రదింపులు సైతం జరిపినట్లు తెలుస్తోంది. అండగా ఉంటామనే భరోసా ఇచ్చారని ఊహాగానాలు వినిపిస్తన్నాయి. బలమైన ఎంపీ అభ్యర్థిగా ఉన్న గల్లా జయదేవ్‌ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రసక్తే లేదని టీడీపీ చెప్తోంది. ఒకప్పుడు ఇక రాజకీయాలకు దూరం అన్నా గల్లా ఫ్యామిలీ ఇప్పుడు కాస్త మెత్తబడిందని తెలుస్తోంది. ఇప్పటికే వ్యాపార పరంగా గట్టి దెబ్బ తగిలిందని ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా యాక్టివ్ కాలేకపోతున్నట్లు గల్లా అనుచరులు చెప్తున్నారు. త్వరలోనే గల్లా జయదేవ్ యాక్టివ్ అవుతారని అనుచరులు చెప్తున్నారు.