Chandrababu: అది సైకోతత్వం...ఇప్పటం కూల్చివేతలపై తీవ్ర ఆగ్రహం
తాడేపల్లి ఇప్పటంలో కొనసాగుతున్న కూల్చివేతల పర్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు...
దిశ, డైనమిక్ బ్యూరో: తాడేపల్లి ఇప్పటంలో కొనసాగుతున్న కూల్చివేతల పర్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఏది ఏమైనా మంచి పని కోసం వెనకడుగు లేకుండా పోరాడితే దాన్ని పట్టుదల అంటారని, కసితో కూల్చడమే లక్ష్యంగా పని చేస్తే దాన్ని సైకోతత్వం అంటారని ప్రభుత్వంపై ట్విటర్ వేదికగా విమర్శించారు. రాష్ట్రంలో వేల కిలోమీటర్ల రోడ్లు పాడైతే పట్టించుకోని ప్రభుత్వానికి ఇప్పటం రోడ్డు మాత్రమే ఎందుకు కనిపిస్తుందన్నారు. వైసీపీ వాళ్లు ఎలాగూ మారరని...ప్రజలే వాళ్లను మార్చేస్తారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా ఇప్పటం గ్రామంలో మరోసారి కూల్చివేతలకు ప్రభుత్వం పూనుకుంది. రోడ్డు విస్తరణ పేరుతో మున్సిపల్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో పలువురు గ్రామస్థుల ఇళ్లను కూల్చివేతలు చేపట్టారు. రెండు జేసీబీలతో 12 ఇళ్ల ప్రహరీ గోడలను కూల్చివేశారు. ఇప్పటం జనసేన పార్టీ అధ్యక్షుడు నరసింహారావు ఇల్లు కూల్చేందుకు ప్రయత్నం చేయడంతో స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఇంటి గోడను కూల్చివేశారు. ఈ చర్యలతో ఇప్పటం గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమను వేధిస్తోందని మండిపడ్డారు.
గతంలో ఇప్పటంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభ జరిగింది. ఈ సభకు స్థలం ఇచ్చారని ఇప్పటంలో పలువురి ఇళ్ల గోడలను కూల్చి వేశారు. తాజాగా మరోసారి ఇళ్ల కూల్చివేతలు జరుగుతుండటంతో ఇప్పటంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Also Read...