సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. హైకోర్టు తీర్పు కొనసాగించాలని ఆదేశాలు
సుప్రీంకోర్టులో సీఎం జగకు ఎదురుదెబ్బ తగిలింది...
దిశ, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టులో సీఎం జగకు ఎదురుదెబ్బ తగిలింది. బెస్ట్ అవైలబుల్ స్కీం విషయంలో హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. ఏపీ ప్రభుత్వ అప్పీల్‌ను డిస్మిస్ చేసింది. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీంను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.
కాగా 2008లో అప్పటి ప్రభుత్వ హయాంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్‌ను తీసుకొచ్చారు. 2019-20లో వరకు ఈ స్కీమ్ కొనసాగింది. స్థానికంగా అందుబాటులో ఉన్న ప్రైవేటు స్కూళ్లలో 1,5,8 తరగతుల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. అంతేకాకుండా ఆ విద్యార్థుల ఫీజులు ప్రభుత్వం తరపున చెల్లించారు. ఒకటో తరగతి విద్యార్థులకు లాటరీ పద్ధతి ద్వారా, 5,8 తరగతుల విద్యార్థులకు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసేవారు. ఈ పథకానికి సంబంధించి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 65 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేలు ఉన్నవారి పిల్లలకు ఈ స్కీం వర్తించేది.
అయితే జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్‌ను రద్దు చేసింది. దీంతో కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో తమ పిల్లలు నష్టపోతున్నారని వాదనలు వినిపించారు. ప్రభుత్వ వాదనలు కూడా విన్న హైకోర్టు.. బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీంను కొనసాగించాలని ఆదేశించింది. అంతేకాకుండా ఈ స్కీమ్ కింద చదువుకునే విద్యార్థులను పదో తరగతి పూర్తయ్యే వరకూ కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.
దీంతో హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం హైకోర్టును తీర్పును కొసాగించాలని ఆదేశించింది. దీంతో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీంను కొనసాగిస్తున్నట్లు ఏపీ సోషల్ వెల్ఫేర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయలక్ష్మి నెం.61 జీవోను జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో 49 వేల మంది విద్యార్థినీ, విద్యార్థులకు ఊరట లభించనుంది.