Cm Jaganలా మోసం చేయను.. వాటిని మళ్లీ అమలు చేస్తాం: Chandrababu

పేదల రక్తాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జలగలా తాగేస్తున్నాడని...అందుకే జగన్ రెడ్డి అని కాకుండా...జలగ రెడ్డి అని పెట్టుకుంటే బాగుంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో మైనారిటీ సోదరులతో ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు...

Update: 2022-12-09 10:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పేదల రక్తాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జలగలా తాగేస్తున్నాడని...అందుకే జగన్ రెడ్డి అని కాకుండా...జలగ రెడ్డి అని పెట్టుకుంటే బాగుంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో మైనారిటీ సోదరులతో ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 1983లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే 1985లోనే ముస్లింలకు మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. ఉర్దును రెండో అధికారక భాషగా చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ముస్లిం సోదరులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటన్నింటిని రద్దు చేసిందని గుర్తు చేశారు. దుకాన్ మకాన్, దుల్హన్ వంటి పథకాలను రద్దు చేశారని ఆరోపించారు. 'మంత్రి పదవులకు 10వ తరగతి చదువు అర్హత అవసరం లేదు. సలహాదారులకు 10వ తరగతి అర్హత అవసరం లేదు...దుల్హన్ పథకానికి మాత్రం 10వ తరగతి చదువుకుని ఉండాలంట' అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నిలిపి వేసిన పథకాలను అమలు చేసి ముస్లిం సోదరులకు అండగా ఉంటానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.


జగన్ రెడ్డిలా మోసం చేయను

ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లడం కోసం.....హైదరాబాద్‌లోనే హజ్ హౌస్ నిర్మించినట్లు పేర్కొన్నారు. నేరుగా హైదరాబాద్ నుంచే యాత్రకు వెళ్లే అవకాశం కల్పించామని...ముస్లింల మనో భావాలు గౌరవించామని. హజ్ యాత్రకు ఆర్థిక సాయం కూడా చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఉర్దు యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. విభజన తరువాత కర్నూలులో ఉర్దు యూనివర్సిటీ కట్టామని చెప్పారు. 10 లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చామన్నారు. సంక్రాంతి సమయంలో సంక్రాంతి కానుక కూడా ముస్లింలకు వర్తింపజేశామని చెప్పారు. తెలుగుదేశం వచ్చిన తరువాత హైదరాబాద్‌లో మత కలహాలు లేకుండా చేశామని, 2014 తరువాత దుకాన్ మకాన్, దుల్హన్ పథకం తీసుకువచ్చామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. వాటన్నింటిని సీఎం వైఎస్ జగన్ రద్దు చేశారని ఆరోపించారు. పెళ్లి కానుక కింద లక్ష ఇస్తానని చెప్పి నిలిపివేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ దుల్హన్ పథకం తీసుకువస్తానన్నారు. జగన్ రెడ్డిలా మోసం చేయనని.....దుల్హన్ పథకం కింద లక్ష చెల్లిస్తానని చెప్పారు. మైనారిటీ పిల్లల్లో ఉన్నత చదువులు అవసరం అని విదేశీ విద్య పథకం పెట్టానని. విద్యతోనే మార్పు అని గుర్తించి విద్యా రంగానికి ప్రాధాన్యం ఇచ్చానని చంద్రబాబు తెలిపారు. ఐటితో జీవితాలు మారుతాయని ఐటి కంపెనీలను ప్రోత్సహించాననని. ఇంజనీరింగ్ కాలేజ్ లు తీసుకువచ్చానని...దీంతో దేశ విదేశాల్లో మన పిల్లలు మంచి ఉద్యోగాలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పలువురు తమ గోడును చంద్రబాబు వద్ద వెల్లబోసుకున్నారు. తన కుమారుడికి విదేశీ విద్య పథకం కింద నాటి టీడీపీ ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తే ఈ ప్రభుత్వం దాన్ని నిలిపివేసిందని సలాం అనే వ్యక్తి చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. వడ్లమూడికి చెందిన పర్వీన్ అనే మహిళ తన రేషన్ కార్డు తీసేశారని రోదించింది. ఉచిత ఇసుక విధానం తీసేయ్యడం వల్ల తాము నష్టపోతున్నామని పలువురు వాపోయారు. ట్యాక్సులతో ఆటోమొబైల్ రంగాన్ని జగన్ సర్కారు సర్వనాశనం తమ గోడు వెళ్లబోసుకున్నారు.

చివరికి మీపైనా దాడికి వస్తారు

నాడు తెలుగుదేశం ప్రభుత్వం అడబిడ్డలకు విద్యలో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. అలాగే ముస్లింలకు విదేశీ విద్యతో మంచి అవకాశాలు సృష్టించే ప్రయత్నం చేసినట్లు స్పష్టం చేశారు. ముస్లింలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం ఇచ్చి అందులో లక్ష సబ్సిడీ ఇచ్చి ముస్లిం వ్యాపారులకు అండగా నిలిచామని అయితే వైసీపీ ప్రభుత్వం వాటన్నింటిని రద్దు చేసిందని అడిగితే కేసులు పెట్టి వేధిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. నంద్యాలలో అబ్దుల్ సలాంపై తప్పుడు కేసులు పెడితే మదనపడి, భయపడి కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పుకొచ్చారు. అధికార పార్టీ, పోలీసుల వేధింపుల కారణంగా భార్య పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఒకరి మీద దాడి జరిగిన్పపుడు స్పందించకపోతే చివరికి మీపైనా దాడికి వస్తారన్నారు. ఎక్కడో అబ్దుల్ సలాం చనిపోతే తమకేంటి అనుకుంటే ఎలా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

వక్ఫ్ బోర్డు ఆస్తులను రక్షిస్తాం

రాష్ట్రంలో ఎప్పుడైనా ఇలాంటి తప్పుడు కేసులు చూశారా? అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. 'పొన్నూరులో సభ పెట్టుకుంటే 10 మంది వచ్చి గొడవ చేసే ప్రయత్నం చేశారని మండపడ్డారు. ఎప్పుడైనా ఇలాంటి సంస్కృతి రాష్ట్రంలో ఉందా.? అని ప్రశ్నించారు. నాడు మనం మొదలు పెట్టిన మసీదులు, షాదిఖానాలు పూర్తి చెయ్యలేదని తెలిపారు. 'వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా...వక్ఫ్ బోర్డు ఆస్తులను కొట్టేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వక్ఫ్ బోర్డు ఆస్తులు రక్షిస్తాం. రాష్ట్రంలో 43 మంది ముస్లింలపై భౌతిక దాడులు జరిగాయి. రంజాన్ తోఫాకు డబ్బులు లేవు. దుకాన్ మకాన్ కు డబ్బులు లేవు. విదేశీ విద్యకు డబ్బులు లేవు. కానీ సొంత పత్రికకు మాత్రం ప్రకటనలు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి. సభలో నాటి మండలి చైర్మన్‌గా ఉన్న షరీఫ్‌ను కూడా దారుణంగా అవమానించారు. ముస్లింల రిజర్వేషన్లు కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను. సుప్రీం కోర్టులో దీని కోసం మీ తరుపున పోరాడుతాను' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

ఒక్కనెలలోనే రూ.50వేల కోట్ల అప్పులు

రాష్ట్రంలో అప్పులు పెరిగిపోతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఒక్క నెలలోనే సీఎం జగన్ 50 వేల కోట్ల అప్పులు చేశాడని మండిపడ్డారు. 'మైనారిటీలకు ఏం కావాలో చర్చిస్తాం. వారికి మంచి చేసే విధానాలు రూపొందిస్తాను. మసీదులకు పట్టాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్న చోట సమస్యను పరిష్కరిస్తాం. ఉచిత ఇసుక విధానం తీసుకువస్తాం. రాష్ట్రంలో ఆటోమొబైల్ రంగం జగన్ విధానాతో సంక్షోభంలోకి వెళ్ళింది. జగన్ బటన్ నొక్కి ఇసుక, మద్యం దందాల డబ్బులు ఇంటికి చేరుతున్నాయి. లారీ ఓనర్లు ప్రభుత్వ ట్యాక్స్ ల కారణంగా తీవ్రంగా నష్టపోయారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి ఆటోమొబైల్ రంగంలోని వారంతా సిద్దం కావాలి. ఉపాధిని దెబ్బతీసిన ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపివెయ్యాలి. ప్రభుత్వం నిలిపివేసిన పెన్షన్‌లు అన్నీ ఆ కాలానికి కూడా కలిపి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత తిరిగి చెల్లిస్తాను. జగన్ రెడ్డి విధానాలకు, వేధింపులకు పెట్టుబడులు తరలిపోతున్నాయి. కంపెనీలు వెళ్లిపోతున్నాయి. జగన్ ఒక అమూల్ బేబి. సంగం వద్దు, విజయ డైరీ వద్దు. అమూల్ మాత్రమే ముద్దు అంటున్నాడు. అన్ని కంపెనీలు తిరిగి తీసుకువస్తాం. యువతకు మన రాష్ట్రంలోనే ఉద్యొగ అవకాశాలు కల్పిస్తాం.' అని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

Also Read....

Kodali Nani : లోకేష్‌కు అడ్డొస్తాడనే.. ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారు 

Tags:    

Similar News