TDP: టీడీపీలోకి కృష్ణా జిల్లా వైసీపీ కీలక నేతలు.. చంద్రబాబు ఏమన్నారంటే..
వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడాలని, రాష్ట్రం గెలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు....
దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడాలని, రాష్ట్రం గెలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలంటే టీడీపీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని ఆయన తెలిపారు. కరుడుగట్టిన నేరస్థుడిని సీఎంను చేసి ప్రజలు అంతా మోసపోయారని విమర్శించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. కృష్ణా జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్‌తో పాటు ఆయన అనుచరులు, మద్దతుదారులు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. రాష్ట్రాన్ని తెలుగు దేశం తప్ప ఎవరూ కాపాడలేరని పార్టీలోకి వచ్చిన సుభాష్ చంద్రబోస్‌ను చంద్రబాబు అభినందించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. ‘నేను నా కోసం కాదు....రాష్ట్రం కోసం ఆలోచన చేస్తున్నా. పోలవరం పూర్తి అయ్యి ఉంటే రాష్ట్రం సుభిక్షం అయ్యేది. తెలంగాణకు హైదరాబాద్ ఉన్నట్లు...మనకు అమరావతి ఉండాలని ప్రయత్నించాను. రాజధాని కోసం భూములు తీసుకున్నాం...నిర్మాణాలు మొదలు పెట్టాం. జగన్ మూడు రాజధానులు అని అమరావతిని ఆపేశాడు. విశాఖను ఎంత నాశనం చేశాడో చూశాం కదా. అమరావతి పూర్తి అయ్యి ఉంటే మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు వచ్చేవి....కానీ నేడు ఆ పరిస్థితి లేదు. కృష్ణా డెల్లాకు నీటి కష్టాలు లేకుండా పట్టిసీమ కట్టాను. పోలవరం కట్టడానికి 5 ఏళ్లు పడుతుందని.....ఏడాదిలో పట్టిసీమ పూర్తి చేశాను. నీళ్లు ఇచ్చాను. నేను తెచ్చిన పట్టిసీమ నీళ్లు తాగారు కానీ నన్ను మరిచిపోయారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చు అని ప్రణాళికలు సిద్ధం చేశాం. ఒక అసమర్థుడు, అవినీతి పరుడు సీఎం అయితే ఏమవుతుందో పోలవరం చూస్తే అర్థం అవుతుంది. పోలవరంలో నిర్మాణ సంస్థలను, అధికారులను మార్చి ప్రాజెక్టుకు నష్టం చేశారు. డయాఫ్రం వాల్, గైడ్ బండ్ దెబ్బతిన్నాయి...దీనికి కారణం ఏంటి?. 5 ఏళ్లు మనం పడిన కష్టం అంతా బూడిదపాలు అయ్యింది. పోలవరం పోయింది, అమరావతి పోయింది’. అని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
సైకో పోవాలి..సైకిల్ రావాలి
వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఒక్క రోడ్డుకూడా బాగాలేదని, నేషనల్ హైవేలు, రాష్ట్ర రహదారులు ఎలా ఉన్నాయో చూడండని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘వాతావరణ పరంగా మన దగ్గర ఎండలుఎక్కువ ఉంటాయి. దీన్ని సోలార్ ఎనర్జీగా ఉపయోగించుకుంటే విద్యుత్ చార్జీలు పెంచాల్సిన అవసరం ఉండదు. కానీ జగన్ ప్రభుత్వం 8 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. ఇది గమనించే నాడు సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించాం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మనం అధికారంలో ఉండి ఉంటే విద్యుత్ చార్జీలు పెంచాల్సిన అవసరం ఉండేది కాదు’. అని చంద్రబాబు చెప్పారు. సోలార్ విద్యుత్ ద్వారా మోటార్ దగ్గరే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చన్నారు. సోలార్ విద్యుత్‌ను మళ్లీ ప్రమోట్ చేసి ప్రజలపై విద్యుత్ భారం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టి.....రైతులకు ఉరితాళ్లు వేసిందని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీకి అధికారంతో బాగుపడిందని ఒకే ఒక్కడు..అదే జగన్ అని చెప్పారు. నాడు మద్య పాన నిషేదం అన్నాడని... నేడు లక్ష కోట్ల మద్యం అమ్మేశాడని..ఈ సిఎంను ఏమనాలి?అని నిలదీశారు. మద్యం షాపుల్లో ఆన్‌లైన్ పేమెంట్లు ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి సీఎంను ఓడించడానికి...అన్ని వర్గాలు కలిసి రావాలని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలని సైకో పోవాలి....సైకిల్ రావాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.