Ap News: ఈసారి తగ్గేదేలే.. ఏప్రిల్ 5లోపు అలా జరగాల్సిందే...!

ఉద్యమంలో విరామం ఉండదు. ఈసారి వెనక్కి తగ్గేదే లేదు. ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం కొనసాగిస్తాం...

Update: 2023-03-18 16:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ‘ఉద్యమంలో విరామం ఉండదు. ఈసారి వెనక్కి తగ్గేదే లేదు. ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం కొనసాగిస్తాం. సీఎస్‌ కేఎస్ జవహర్ రెడ్డికి ఇచ్చిన 50 పేజీల మెమోరాండంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆపేది లేదు’ అని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఉద్యోగులవద్దకే వెళ్లి చెయ్యి చేయి కలుపుదాం కార్యక్రమంలో భాగంగా శనివారం విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రిటైర్డు, కాంట్రాక్టు అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక, ఆర్థికేతర సమస్యల సాధన కోసం, ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోసం కొనసాగుతున్న ఈ పోరాటంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంతవరకు ఈ ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని వెల్లడించారు.

లిఖితపూర్వకంగా హామీ ఇచ్చేవరకు పోరాటం ఆగదు

ఈనెల 21 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఏపీ జేఏసీ అమరావతి ఇచ్చిన పిలుపు మేరకు‘వర్క్ టూ రూల్’ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్యోగులంతా విజయవంతం చేయాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు కోరారు. ఈనెల 21 నుంచి ఉదయం 10.30గం. నుండి సాయింత్రం 5.00 వరకు ప్రభుత్వ పని గంటలలో మాత్రమే పని చేయాలని రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 5 వరకు జరగనున్న వివిధ రకాల నిరసన కార్యక్రమాల్లో ప్రతీ ఉద్యోగి పాల్గొనాలని.. నల్ల బ్యాడ్జిలతో తమ నిరసన తెలపాలని కోరారు.

21 నుంచి ప్రతి ఉద్యోగి వర్క్ టూ రూల్

ఈనెల 21 నుంచి ప్రతి ఉద్యోగి వర్క్ టూ రూల్ పాటించాలని కోరారు. ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి చట్టబద్ధంగా రావాల్సిన పాత పెండింగ్ బకాయిలు డీఏ, పీఆర్సీ వంటి ఇతర ఆర్ధిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి లిఖిత పూర్వకమైన హామీ ఇవ్వాల్సిందేనని బొప్పరాజు పట్టుబట్టారు. న్యాయమైన తమ సమస్యల పరిష్కారం చేసేంతవరకు ఈ ఉద్యోగుల ఉద్యమం ఆపేదేలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి తెలిసే విధంగా అందరూ ఉద్యోగులు కూడా ఐక్యంగా ఉండి పోరాటం చేద్దామని తెలిపారు. ఈ ఉద్యమానికి వివిధ శాఖల ఉద్యోగులు శాఖలకు అతీతంగా ప్రతి ఉద్యోగి ఈ ఉద్యమానికి మద్దతు పలకాలని బొప్పరాజు విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 5లోపు ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. 

Tags:    

Similar News