మరింత దూకుడుగా సీఎం జగన్.. కలెక్టర్లు, నేతలకు కీలక సూచనలు

ఎన్నికల సమయం సమీస్తున్న వేళ ఏపీ సీఎం జగన్ మరింత దూకుడు పెంచారు. 1...

Update: 2023-12-28 10:53 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల సమయం సమీస్తున్న వేళ ఏపీ సీఎం జగన్ మరింత దూకుడు పెంచారు. 175 స్థానాల్లో విజయబావుట ఎగురవేసేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ‘విశ్వనీయత’ అనే నినాదంతో జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమంతో ప్రతి ఒక్కరిని కలిసేలా వ్యూహాలు రచిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి నెరవేర్చామని ప్రజలకు వివరించనున్నారు. మరోవైపు జనవరి 1 నుంచి ఫించన్‌ను రూ. 3 వేలకు పెంచనున్నారు. అలాగే ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా గురువారం తాడేపల్లిలో కలెక్టర్లు, నేతలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహిళల్లో సుస్థిర జీవనోపాధే ఆసరా చేయూత పథకాల ఉద్దేశమని చెప్పారు. మల్టీ నేషనల్, ప్రముఖ కంపెనీలతో టై అప్ చేయించామన్నారు. స్వయం ఉపాధి పథకాలతో మహిళల జీవితాల్లో వెలుగులు వచ్చాయని పేర్కొన్నారు. ప్రీ లాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాలపై వారికి అవగాహన కల్పించామన్నారు. పెన్షన్ కానుక, ఆసరా, చేయూత లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసిందని, వారి విజయగాధలను వీడియోల రూపంలో పంపాలని నిర్ణయించినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. అలాంటి వీడియోల్లో అత్యుత్తమమైన వాటికి బహుమతులు అందజేయాలని సూచించారు. వీటి వల్ల మరికొందరికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయన్నారు. ఉత్తమ వాలంటీర్లకు ఫిబ్రవరి 15-16 తేదీల్లో అవార్డులు అందిస్తామని సీఎం తెలిపారు. లబ్ధిదారులపై ఉత్తమ వీడియోలు పంపిన వారికి సైతం అవార్డులు ఇస్తామని జగన్ చెప్పారు.

ఫిబ్రవరి 5 నుంచి 14 వరకూ వైఎస్సార్ చేయూత కార్యక్రమం నిర్వహిస్తామని, ఇప్పటి వరకు రూ. 14,129 కోట్లు పంపిణీ చేశామని సీఎం జగన్ స్పష్టం చేశారు. చివరి విడతలో 26 లక్షల 39 వేల 703 మంది లబ్ధి పొందనున్నారని చెప్పారు. డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని జనవరి 19న విజయవాడలో ప్రారంభిస్తామని సీఎం జగన్ వెల్లడించారు.

Tags:    

Similar News