అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం... జగన్‌ను పలకరించిన రఘురామ

అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఓ ఆసక్తిరక సన్నివేశం చోటు చేసుకుంది.

Update: 2024-07-22 07:13 GMT

దిశ, డైనమిక్‌ బ్యూరో: అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం లాబీలో ఓ ఆసక్తిరక సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీకి వస్తున్న మాజీ సీఎం జగన్‌, ఎమ్మెల్యే రఘురామకృష్ణమరాజు.. ఇద్దరూ ఎదురు పడ్డారు. వెంటనే జగన్‌ను హాయ్‌ అంటూ ఆర్‌ఆర్‌ఆర్‌ పలకరించారు. రోజు అసెంబ్లీకి రా.. ప్రతిపక్షం లేకపోతే ఎలా? అంటూ జగన్‌ చేతిలో చేయి వేసి మాట్లాడారు. దానికి జగన్‌ బదులిచ్చారు. అసెంబ్లీకి రెగ్యులర్‌ వస్తా.. మీరే చూస్తారుగా అని సమాధానం ఇచ్చారు. జగన్‌ భుజంపై చేయి వేసి రఘురామ కాసేపు మాట్టాడారు. తనకు జగన్‌ పక్కనే సీటు వేయించాలని అక్కడే ఉన్న పయ్యావుల కేశవ్‌ను కోరారు. తప్పని సరిగా అంటూ కేశవ్‌ నవ్వుతూ వెళ్లారు. అక్కడే ఉన్న పలువురు వైసీపీ ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలు రఘురామను పలకరించారు.

మాజీ సీఎం జగన్‌కు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే, మాజీ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణమరాజుకు బద్ద వైరం ఉన్న విషయం తెలిసిందే. ఓ కేసులో జగన్‌ తనను అరెస్టు చేయించి సీఐడీ పోలీసులతో కొట్టించారని ఆర్‌ఆర్‌ఆర్‌ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్‌పైన, అప్పటి సీఐడీ చీఫ్‌ సునీల్‌ పైన మరోసారి పోలీసు కేసు పెట్టారు. ఈ కేసు గుంటూరులో నమోదైంది. తనకు న్యాయం జరిగే వరకు జగన్‌ను వదిలేది లేదంటూ రఘురామ పలు సందర్భాల్లో చెప్పారు. ఈ క్రమంలో ఇద్దరూ ఎదురు పడడం, పలకరించుకోవడం.. ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News