అనంతను తాకనున్న అరెస్టులు?
ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అక్రమాలు ప్రస్తుతం ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలై రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే.
దిశ ప్రతినిధి, అనంతపురం: ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అక్రమాలు ప్రస్తుతం ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలై రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతంలో జరిగిన అనేక అక్రమాలపై వరుసగా సీఐడీ కేసులు నమోదవుతున్నాయి. అక్రమార్కుల అరెస్టులకు కూడా రంగం సిద్ధమవుతోంది. ఈ అరెస్టులు ప్రస్తుతం అనంతపురం జిల్లాను కూడా తాకనున్నాయనే చర్చ జరుగుతోంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చెందిన రాక్రీట్ సంస్థ అక్రమాలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడమే ఇందుకు కారణం. రూ. 200 కోట్లకు పైగా ఈ సంస్థ అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలున్నాయి. విజిలెన్స్ విచారణ ఆధారంగా కేసులు నమోదు చేసి అరెస్టులకు సీఐడీ శ్రీకారం చుడుతుందేమోననే భయం అటు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని, ఇటు హౌసింగ్ అధికారులను వెంటాడుతోంది.
ఇంతకూ రాక్రీట్ చేసిన అక్రమాలేమిటి..?
రాష్ట్రంలో జగనన్న ఇళ్ల పథకం కింద అప్పటి వైసీపీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆప్షన్-3 కింద 3.25 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పటి ప్రభుత్వం అప్పగించింది. వాటిలో 63 వేల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టును అప్పటి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చెందిన రాక్రీట్ సంస్థకు కేటాయించింది. అయితే, సక్రమంగా ఇళ్ల నిర్మాణం చేపట్టని కారణంగా 13 వేల ఇళ్లు రద్దు చేసింది. మిగతా 50 వేల ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన రాక్రీట్ సంస్థ ఇసుక, సిమెంట్, స్టీల్ వంటి వాటిలో భారీగా దోచుకుందనే ఆరోపణలున్నాయి. ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే కాకుండా వైఎస్ఆర్, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని గృహ నిర్మాణ పనుల్లోనూ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇళ్లు నిర్మించకుండానే అధికారులు చాలావరకు బిల్లులు చెల్లించారనే విమర్శలున్నాయి. ఒక్కో ఇంటికి బేస్ మెంట్ స్థాయి వరకు నిర్మించాక.. మొదటి విడతగా రూ.60 వేలు చెల్లించాల్సి ఉంది.
కానీ, ఆయా జిల్లాల్లో ఈ సంస్థకు మాత్రం అధికారులు ఇళ్లు పూర్తయినట్టు కాగితాల్లో చూపించి పూర్తిగా బిల్లులు చేశారనే విమర్శలున్నాయి. ఇసుక, సిమెంట్, స్టీల్ పేరుతో పెద్ద ఎత్తున నిధుల దోపిడీ జరిగిందని, కొన్నిచోట్ల ఇళ్లు నిర్మించకుండానే బిల్లులు కాజేశారనే ఆరోపణలున్నాయి. రెండువేల ఇల్లు బేస్మెంట్ స్థాయిలోనూ, మరో మూడు వేల ఇళ్లు ఆర్సీసీ స్థాయిలోనూ ఉన్నాయని, మిగతా వాటిలో చాలా వరకు పనులు మొదలు పెట్టలేదని చెబుతున్నారు. కానీ, బిల్లులు మాత్రం అధికారులు దాదాపు చెల్లించడం పై విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథికి ఆధారాలతో సహా మాజీ మంత్రి పరిటాల సునీత ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే వారు విచారణ కూడా ప్రారంభించారు. త్వరలోనే నివేదిక అందజేయనున్నారు. దీని ఆధారంగా సీఐడీ కేసులు నమోదు చేసే అవకాశముంది.
నిష్పాక్షికంగా విచారణ జరగాలి: పరిటాల సునీత
రాక్రీట్ సంస్థ ద్వారా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన అక్రమాలపై నిష్పక్షపాతంగా విజిలెన్స్ విచారణ జరగాలని మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత డిమాండ్ చేస్తున్నారు. తాను చేసిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. గతంలో ప్రకాష్ రెడ్డి అక్రమాలపై హౌసింగ్ అధికారులు ఒక నివేదిక సిద్ధం చేశారని.. అయితే, అది బయటకు రాకుండా అధికారం అండతో తొక్కి పెట్టారన్నారు. ఆ నివేదికను కూడా తీసుకుంటే రాక్రీట్ అక్రమాలు బయటకొస్తాయని సునీత అభిప్రాయపడ్డారు. ప్రజా సొమ్మును దోచుకున్న ప్రకాష్ రెడ్డి నుంచి ఆ సొమ్ము రికవరీ చేయాలన్నారు. దీని నుంచి ప్రకాష్ రెడ్డి తప్పించుకోలేరని, శిక్ష అనుభవించక తప్పదని ఆమె పేర్కొన్నారు.