'ధైర్యం ఉంటే చెప్పు'.. దేవినేని ఉమాకు మంత్రి అంబటి సవాల్
దిశ, ఏపీ బ్యూరో : మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుల..latest telugu news
దిశ, ఏపీ బ్యూరో : మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుల మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పోలవరంతో పాటు రాష్ట్రంలోని పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల ఆలస్యానికి టీడీపీయే కారణమని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అంబటి రాంబాబు ఆరోపణలకు నాటి జలవనరుల శాఖ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా సైతం కౌంటర్లు ఇస్తున్నారు. అయితే తాజాగా మంత్రి అంబటి రాంబాబు, మాజీమంత్రి దేవినేని ఉమాల మధ్య సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరిగింది.
దేవినేని ఉమా ఓ ట్వీట్ చేసి వెంటనే తొలగించాడంటూ అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ ట్వీట్ పెట్టి, డిలీట్ చేసిన మాట వాస్తవమా, కాదా? ధైర్యముంటే చెప్పు ఉమా అని అంబటి ప్రశ్నించారు. అంతేకాదు దేవినేని ఉమా మహేశ్వరరావు పోస్టు చేసి తొలగించిన ట్వీట్‌ను సైతం ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అయితే జనసేన పార్టీని ఉద్దేశించి దేవినేని ఉమా చేసినట్లు ఆ ట్వీట్‌లో ఉంది. ఇంతకీ దేవినేని ఉమా ఆ ట్వీట్‌లో ఏం చెప్పారంటే 'ఒక్కచోట కూడా గెలవని సన్నాసులు మాకు ఆప్షన్లు ఇవ్వడం చూస్తుంటే ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి వెళతాను అన్నది అంట' అని పేర్కొన్నారు. జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు ఆప్షన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆప్షన్ల గురించే దేవినేని ఉమా ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.