చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేవు: మాజీ సీఎం జగన్

తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు.

Update: 2024-10-04 10:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేవని, దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్న చంద్రబాబు.. రాజకీయమే ముఖ్యమన్నట్లు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిలోని తన నివాసంలో ఈ రోజు (శుక్రవారం) మీడియాతో మాట్లాడిన జగన్.. ‘‘చంద్రబాబు వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పు బట్టింది. ఆయన ప్రభుత్వం వేసిన సిట్‌ను కూడా ధర్మాసనం రద్దు చేసింది. మత విశ్వాసాలను ఎలా రెచ్చగొడుతున్నారో సుప్రీం కోర్టు అర్థం చేసుకుంది. చంద్రబాబు నిజస్వరూపం సుప్రీం కోర్టు ఎత్తి చూపింది. కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెబుతున్నా.. రాజకీయ దుర్బుద్ధితో జంతువుల కొవ్వు కలిసిందని బాబు ప్రచారం చేశారు. ఆయన తిరుమల పవిత్రతను దెబ్బతీసి అపవిత్రం చేశారు. చంద్రబాబు, ఈవో ప్రకటనలు విరుద్ధంగా ఉన్నాయి. దేవుడంటే బాబుకు భయం, భక్తి లేవు. సుప్రీం కోర్టు వ్యాఖ్యలు, ఆదేశాలను బాబు వక్రీకరిస్తున్నారు. చంద్రబాబును సుప్రీంకోర్టు తిడితే ఆ విషయంలో కూడా మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బావ, బాబాయ్, మామ అంటూ వక్రీకరిస్తున్నారు. రాజకీయమే ముఖ్యమన్నట్లు చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు’’ అంటూ విమర్శలు గుప్పించారు.

అలాగే తిరుపతి టెండరింగ్ వ్యవస్థ చాలా గొప్పదని, నాణ్యత లేని ట్యాంకర్లను వెనక్కి పంపడం పెద్ద విషయం కాదని, చంద్రబాబు హయాంలో 14 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపించారని, తమ హయాంలో కూడా 18 సార్లు వెనక్కి పంపడం జరిగిందని జగన్ తెలిపారు. ఇది కచ్చితంగా కోట్ల మంది భక్తుల మనోభావాలతో ఆడుకోవడమేనని ఆక్షేపించిన జగన్.. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, దాని నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే ఇలా లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. చంద్రబాబు వెంటనే తాను తప్పు చేశానని ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


Similar News