రూ.5.50 కోట్ల విదేశీ సిగరెట్లు ధ్వంసం

నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రవాణా చేస్తూ, సుంకం చెల్లించకుండా వేర్వేరు కేసుల్లో పట్టుబడిన రూ.5.50 కోట్ల విలువ చేసే విదేశీ సిగరెట్లను ధ్వంసం చేసినట్లు ఏపీ కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి తెలిపారు.

Update: 2024-10-26 01:44 GMT

దిశ ప్రతినిధి, గుంటూరు: నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రవాణా చేస్తూ, సుంకం చెల్లించకుండా వేర్వేరు కేసుల్లో పట్టుబడిన రూ.5.50 కోట్ల విలువ చేసే విదేశీ సిగరెట్లను ధ్వంసం చేసినట్లు ఏపీ కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి తెలిపారు. స్వాధీనం చేసుకున్న సిగరెట్లను గుంటూరు, విశాఖపట్నంలలో గల జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌లలో శుక్రవారం కాల్చి బూడిద చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. కాకినాడ, విజయవాడ, నెల్లూరు, తిరుపతిలలో తమ అధికారులు పట్టుకున్న 82,71,836 విదేశీ సిగరెట్ స్టిక్కులను స్వచ్ఛతా హీ సేవ 4.0 కార్యక్రమంలో భాగంగా నాశనం చేసినట్లు తెలిపారు. గుంటూరు జిందాల్ ప్లాంట్ వారి సహకారంతో 73.71 లక్షల సిగరెట్ స్టిక్‌లు, విశాఖ జిందాల్ ప్లాంట్ వారి సహకారంతో 9 లక్షల సిగరెట్లు స్టిక్స్‌ను ధ్వంసం చేశామన్నారు. అన్ని అనుమతులతో, పర్యావరణానికి హాని కలగకుండా కార్యక్రమాన్ని పూర్తి చేశామన్నారు.

ధ్వంసం చేసిన వాటిలో పారిస్, డరమ్ బ్లాక్ వంటి వివిధ చౌకబారు బ్రాండ్ సిగరెట్లు ఉన్నాయన్నారు. కస్టమ్స్ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఈ సిగరెట్లు భారతదేశంలోకి అక్రమంగా దిగుమతి చేయబడ్డాయని తెలిపారు. ఈ సిగరెట్లు మార్కెట్‌లో విక్రయించడం చట్టరీత్యా నేరమని కమిషనర్ వెల్లడించారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే నాసిరకంతో కూడుకున్న ఇటువంటి సిగరెట్లు అక్రమ రవాణాపై చర్యలు చేపడతామన్నారు. ఇలాంటి పన్ను చెల్లించని ఎన్నో బ్రాండ్ల విదేశీ సిగరెట్లు పలు అక్రమ మార్గాలలో మన దేశంలోకి చొరబడుతున్నాయని, వీటిని ఎవరైనా విక్రయించినా, సరఫరా చేసినా భారీ పెనాల్టీ విధించటంతో పాటు, జైలుకు కూడా పంపిస్తామని ఆయన హెచ్చరించారు. సిగరెట్ల ధ్వంసం కార్యక్రమంలో డీఆర్ఐ డీసీ సాహస సూర్య, కస్టమ్స్ ఏసీ అబ్దుల్ అజీమ్ కస్టమ్స్ సూపరింటెండెంట్లు కిషోర్, వివేక్, వేణుగోపాల్, నందిపాటి శ్రీనివాస్ చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Similar News