‘తక్షణమే హంద్రీనీవా కాలువ గండిని పూడ్చండి’:మంత్రి సవిత

సోమందేపల్లిలో హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ పడిన గండి తక్షణమే పూడ్చాలని నీటిపారుదల శాఖాధికారులను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత ఆదేశించారు.

Update: 2024-10-22 14:07 GMT

దిశ ప్రతినిధి,పెనుగొండ: సోమందేపల్లిలో హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ పడిన గండి తక్షణమే పూడ్చాలని నీటిపారుదల శాఖాధికారులను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత ఆదేశించారు. సోమవారం కురిసిన భారీ వర్షాలకు సోమందేపల్లి మండలం మంచేపల్లి గ్రామంలో హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) కాలువకు మంగళవారం గండి పడింది. విషయం తెలుసుకున్న మంత్రి సవిత.. హెచ్ఎన్ఎన్ఎస్ ఇంజనీరింగ్ అధికారులతో మంగళవారం అమరావతి నుంచి ఫోన్లో మాట్లాడారు.

తక్షణమే కాలువ గండి పూడ్చి నీరు వృథాను అడ్డుకోవాలని ఆదేశించారు. పంట నష్టం జరగలేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వరద నీరంతా పంది పర్తి చెరువు, మంచేపల్లి చెరువుల్లోకి చేరుతోందని వెల్లడించారు. మంచేపల్లి చెరువులో ఇప్పటికే వంద శాతం నీరు చేరిందన్నారు. ఆ చెరువు నిండిన తర్వాత పక్కన ఉన్న ఈదులబళాపురం చెరువులోని వరదనీరు వెళ్లనుందని మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత స్పందిస్తూ, ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టుకోవాలని, తక్షణమే గండి పూడ్చి.. నీటి వృథాను అరికట్టాలని ఆదేశించారు. హంద్రీనీవా నీరు చేరుతున్న చెరువు కట్టలను కూడా బలోపేతం చేయాలని మంత్రి సవిత సూచించారు.


Similar News