రైతు ఆత్మహత్యలు జగన్ సర్కార్ హత్యలే: నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు కలచివేస్తున్నాయని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు కలచివేస్తున్నాయని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రైతుల ఆత్మహత్యలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని అన్నారు. పంట నష్టపోయి, ప్రభుత్వం ఆదుకోక దుగ్గిరాలలో మరో రైతు కిశోర్ బాబు ఆత్మహత్య చేసుకోవడంపై నారా లోకేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ప్రాంతానికి చెందిన రైతు తుల్లిమిల్లి బసవయ్య పది రోజుల క్రితం బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆ ఘటన మరువకముందే మరోక రైతు ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమన్నారు. రైతులు ఆత్మహత్యకి పాల్పడటం రాష్ట్రంలో రైతన్నల దుస్థితికి అద్దం పడుతోందని అన్నారు. తుఫాను వల్ల ఐదెకరాల మినుము పంట నష్టపోయి చేసిన అప్పులు తీర్చే మార్గంలేక కిశోర్ బాబు బలవన్మరణానికి పాల్పడిన సంఘటనతో తీవ్రవిషాదంలో మునిగిపోయానని లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పదిరోజుల క్రితం దుగ్గిరాలకి చెందిన రైతు తుల్లిమిల్లి బసవ పున్నయ్య ఆత్మహత్య తనని తీవ్రంగా కలిచివేసిందన్నారు. కరువుతో కొంత, తుఫానుతో పూర్తిగా నష్టపోయినా, జగన్ సర్కారు ఆదుకోకపోవడం వల్లే అన్నదాతల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, ఇవి జగన్ సర్కారు చేసిన హత్యలు అని లోకేశ్ ఆరోపించారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే మన రాష్ట్రం రెండో స్థానం, రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉండటం వైసీపీ ప్రభుత్వం రైతన్నల పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్యవైఖరికి నిదర్శనమని చెప్పుకొచ్చారు. రైతులెవరూ అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని, మూడునెలల్లో ప్రజాప్రభుత్వం వచ్చి ఆదుకుంటుందని నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. ఆత్మహత్యకి పాల్పడిన తుల్లిమిల్లి బసవపున్నయ్య కుటుంబానికి టీడీపీ ఆర్థికంగా ఆదుకుందని... కిశోర్ కుటుంబానికి కూడా అండగా ఉంటామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.