Caste dispute: తమ్ముడు ఎస్సీ.. అక్క ఎస్టీ.. ఎలా..?

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సంచలన ఆరోపణలు చేశారు..

Update: 2024-02-15 13:42 GMT

దిశ, వెబ్ డెస్క్: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సంచలన ఆరోపణలు చేశారు. కొత్తపల్లి గీత అసలు గిరిజనురాలు కాదని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు గీత నకిలీ గిరిజనురాలు అని వ్యాఖ్యానించారు. అరకులో గిడ్డి ఈశ్వరి మీడియాతో మాట్లాడారు. ఒకే కుటుంబంలో తమ్ముడు ఎస్సీ అయితే అక్క ఎస్టీ ఎలా అవుతారని ఆమె ప్రశ్నించారు. అరకు టికెట్ కొత్తపల్లి గీతకు ఇవ్వొద్దని అన్ని పార్టీలకు గిడ్డి ఈశ్వరి ఈ సందర్భంగా సూచించారు. బీజేపీ టికెట్ కొత్తపల్లి గీతకు ఇస్తే గిరిజనులంతా ఏకమై పోరాటం చేస్తామని గిడ్డి ఈశ్వరి హెచ్చరించారు.


కాగా అల్లూరు జిల్లా అరకు నుంచి కొత్తపల్లి గీత ఎంపీగా గెలిచారు. 2019లో సీటు రాకపోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. అయితే కొత్తపల్లి గీత ఎస్టీ కులస్తురాలు కాదంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2016లో ఆమెపై జరిగిన కుల విచారణ నివేదిక ఆధారంగా అప్పటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ సదరు కొత్తపల్లి గీత ఎస్టీ (వాల్మీకి) కులస్తురాలేనంటూ నిర్ధారిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే కలెక్టర్ ఉత్తర్వులపై ఏపీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఉత్తర్వులను ఆక్షేపిస్తూ ప్రభుత్వం వద్ద 2016లోనే అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్ పై టీడీపీ, వైసీపీ ప్రభుత్వంలో ఇద్దరు చొప్పున మొత్తం నలుగురు మంత్రులు విచారణ జరిపారు.

అయితే ఇటీవల కొత్తపల్లి గీత హైకోర్టును ఆశ్రయించారు. అప్పీల్ పై జరుగుతున్న విచారణ తీరును కోర్టులో సవాల్ చేశారు. దీంతో నాలుగు నెలల్లో అప్పీల్‌ను ముగించాలని ఆదేశించింది. ఈ అప్పీల్ కేసుపై గిరిజన మంత్రి పి. రాజన్న దొర విచారణ జరిపారు. ఆమె ఎస్టీ కాదని నిర్ధారించారు. నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. దీంతో కొత్తపల్లి గీతకు ఎస్టీగా ఇచ్చిన కలెక్టర్ ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు ఈ అంశం మళ్లీ తెరపైకి రావడంతో కొత్తపల్లి గీతపై టీడీపీ నాయకురాలు గిడ్డి ఈశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు.


Similar News