నాగబాబుతో విభేదాలు..మాజీ మంత్రి కొణతాల క్లారిటీ
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు...
దిశ, వెబ్ డెస్క్: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు. విశాఖలో కొణతాల నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్.. దాదాపు 50 నిమిషాలతో పాటు ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా కొణతాల మీడియాతో మాట్లాడారు. తాను ఊరిలో లేనందున నాగబాబు సమావేశానికి వెళ్లలేదని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్దిపై పవన్ కల్యాణ్‌తో చర్చించానని పేర్కొన్నారు. తన పోటీపై నిర్ణయం జనసేన అధినేతదేనని చెప్పారు. పొత్తులపై టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. మూడో వంతు సీట్లు జనసేన తీసుకునేలా ప్రయత్నాలు చేస్తున్నామని కొణతాల పేర్కొన్నారు.
అంతకుముందు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిశారు. విశాఖ పర్యటనలో భాగంగా కొణతాల రామకృష్ణ ఇంటికి మర్యాదపూర్వకంగా వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ను కొణతాల సోదరుడు రఘునాథ్ కుటుంబ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. దాదాపు 50 నిమిషాలపాటు కొణతాలతో పవన్ భేటీ అయ్యారు.
కాగా అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జనసేన కార్యక్రమాలకు దూరంగా కొణతాల ఉంటున్నారు. రెండు సార్లు నాగబాబు అనకాపల్లి ఎంపీ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం అయినా కొణతాల రామకృష్ణ పాల్గొనలేదు. రెండు రోజుల క్రితం కొణతాల ఇంటికి నాగబాబు వెళ్లారు. అనకాపల్లి అసెంబ్లీ నుండి పోటీ చేయాలని నాగబాబు కోరారు. కొణతాల నుండి స్పందన లేకపోవడంతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదివారం రాత్రి నేరుగా కొణతాల ఇంటికి వెళ్లి చర్చించారు. ఈ భేటీ ముగిసిన అనంతరం పవన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.