AP News:సాగునీటి సంఘాల ఎన్నికలకు సర్వం సిద్ధం

సాగు నీరు చివరి భూములకు చేరాలనే ఉద్దేశంతో సాగు నీటి ఎన్నికలకు రంగం సిద్ధం చేసింది.

Update: 2024-12-12 13:42 GMT

దిశ,కారంపూడి: సాగు నీరు చివరి భూములకు చేరాలనే ఉద్దేశంతో సాగు నీటి ఎన్నికలకు రంగం సిద్ధం చేసింది. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించక పోవడం వలన సాగు నీరు అందక మెజరు కాలువలకు మరమ్మత్తులకు కూడా మరచి పోయారు. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎన్నికలకు శ్రీకారం చుట్టారు. వీటి నిర్వహణకు ఇప్పటికే జలవనరుల శాఖాధికారులు కసరత్తు పూర్తి చేశారు. జిల్లా అధికారుల ఆదేశాలతో బుధవారం నోటిఫికేషన్ సైతం విడుదల చేశారు. కారంపూడి సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికే గ్రామాల్లో నీటి సంఘాలకు సంబంధించిన ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ఆయా ప్రాంతాల్లో ప్రదర్శించారు.

ఈ నెల 14న 16 నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రెవెన్యూ జలవనరుల శాఖ అధికారులు సిద్ధమై, ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ సైతం ఇచ్చారు. 2003లో సాగునీటి సంఘాలకు ఎన్నికలు మొదలవగా, చివరి సారిగా 2015లో జరిగాయి. ఈ పదవీ కాలం 2020లో ముగిసింది. కారంపూడి సబ్ డివిజన్ పరిధిలోని కారంపూడి, మిరియాల , చింతపల్లి, ఒప్పిచర్ల, చర్ల గుడిపాడు, గోగులపాడు, పల్లె గుంట, గంగారాం, పులిపాడు, గామాలపాడు , పొందుగుల, పెద్ద గార్ల పాడు, జానపాడు, గుత్తికొండ గుండ్ల పల్లి, పరిధిలో ఆయా గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. రైతులు తమ గుర్తింపు కార్డుతో వచ్చి ఓటు వేయాల్సి ఉంటుంది . 17 తేదిన 2 డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఎన్నికలు డీసీ 3, డీసీ 4 ఎన్నికలు జరగనున్నట్లు జలవనరుల అధికారులు తెలిపారు.


Similar News