AP:వరద ఉధృతితో ఉరకలేస్తున్న బుడమేరు..స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు

వరద ఉధృతితో ఉరకలేస్తున్న బుడమేరు వాగు ఏలూరు జిల్లా పెదపాడు మండలం గోగుంట, రాళ్లపల్లి వారి గూడెం గ్రామాల్లోకి ప్రవహించింది.

Update: 2024-09-06 14:32 GMT

దిశ, ఏలూరు:వరద ఉధృతితో ఉరకలేస్తున్న బుడమేరు వాగు ఏలూరు జిల్లా పెదపాడు మండలం గోగుంట, రాళ్లపల్లి వారి గూడెం గ్రామాల్లోకి ప్రవహించింది. వరద ప్రభావంతో మోకాళ్ళ లోతు నీళ్లు చేరడంతో మండల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ రెండు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. పెదవేగి సీఐ నబీ, పెదపాడు ఎస్సై కె.శుభ శేఖర్‌ ఈ రెండు గ్రామాల్లో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నివాసం ఉంటున్న స్థానికులను కలిసి వారికి వరద ఉధృతిని వివరించి వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వృద్ధులను, చిన్నారులను పోలీసులు స్వయంగా చేతుల మీద ఎత్తుకొని ట్రాక్టర్ ఎక్కించి పునరావాస శిబిరాలకు తరలించారు. బుడమేరు వరద ఉధృతి పెరుగుతుండడంతో పెదపాడు మండలం గోగుంట గ్రామం లోకి నీరు చేరింది.

గ్రామ ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా దగ్గరుండి పరిస్థితులు ఎప్పటి కప్పుడు పెదపాడు ఎస్సై కె.శుభ శేఖర్, తహశీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ తేజ రతన్ సిబ్బంది పరిశీలిస్తున్నారు. గొగుంట లో ముంపుకు గురైన గ్రామస్తులను వసంతవాడ జిల్లా పరిషత్ హై స్కూల్ పునరావాస కేంద్రానికి ట్రాక్టర్ లపై తరలించి భోజన, వసతులు ఏర్పాటు చేశారు. నూజివీడు ఇంచార్జ్ డీఎస్సీ డి.శ్రావణ్ కుమార్ ఆదేశాలపై పెదవేగి ఇన్స్పెక్టర్ నబి, పెదపాడు ఎస్సై శుభ శేఖర్ బుడమేరు వరద నీరు పెదపాడు మండలంలోని పలు గ్రామాల్లో వచ్చి చేరుతున్న నేపథ్యంలో మండలంలోని పలు గ్రామాల్లో పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఆస్తి నష్టం ప్రాణ నష్టం కలగకుండా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని పోలీస్ అధికారులు అవగాహన కల్పించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ట్రాక్టర్‌ల పైన ఇతర వాహనాల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలించారు.


Similar News