దీపావళి ధమాకా.. వివిధ శాఖల అధికారులకు కాసుల వర్షం

దీపావళి పండుగ నేపథ్యంలో రెండు రోజులపాటు నిర్వహించుకునే బాణసంచా షాపుల కేటాయింపులో వివిధ శాఖల అధికారులకు కాసుల వర్షం కురిపించబోతుంది.

Update: 2024-10-23 02:22 GMT

దిశ, అన్నవరం: దీపావళి పండుగ నేపథ్యంలో రెండు రోజులపాటు నిర్వహించుకునే బాణసంచా షాపుల కేటాయింపులో వివిధ శాఖల అధికారులకు కాసుల వర్షం కురిపించబోతుంది. దీపావళి సామాగ్రి విక్రయాలకు సంబంధించిన పలు ప్రభుత్వ శాఖల అనుమతులు పొందేందుకు నిర్వాహకులు తంటాలు పడుతున్నారు. ప్రభుత్వానికి చెల్లించే చలానాతో పాటు అదనంగా మామూళ్లు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. షాపుల ఏర్పాటుకు సంబంధించి ఎమ్మార్వో, ఫైర్, ఆర్డీఓ, పోలీసు తదితర శాఖల అనుమతి తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.

ముక్కుపిండి వసూలు..

దీపావళి టపాకాయల విక్రయాలు లక్షల్లో జరుగుతాయని ఉద్దేశంతో ప్రభుత్వ శాఖల అధికారులు నిర్వాహకుల నుంచి వేళల్లో ముక్కు పిండి మరీ వసూలు చేయాలన్న ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ చలానాతో పాటు అదనంగా ఒక్కో షాపునకు రూ.3వేలు నుంచి రూ.4వేలను ప్రతి శాఖ వసూలు చేస్తున్నట్లు వినికిడి. అలాగే అన్నవరం దేవస్థానం జూనియర్ కళాశాల లేదా సంస్కృత ఉన్నత పాఠశాల ఆవరణలో దీపావళి సామాన్లు షాప్ ఏర్పాటు చేసుకునేందుకు ఒక్కో షాపునకు రూ.12 వేలు దేవస్థానం చలానా రూపంలో కట్టించుకోనున్నట్లు తెలిసింది. దీంతో పాటు అదనంగా సీ విభాగంలోని ఓ ఉద్యోగి రూ.5 వేల వరకు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


Similar News