‘దిశ’ ఎఫెక్ట్: వార్డు సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు.. ‘విధులకు డుమ్మా’ కథనంపై కదిలిన అధికారులు

సచివాలయాల్లో సమయపాలన లేకుండా ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్న వార్డు సచివాయాల ఉద్యోగుల పని తీరును శనివారం ‘విధులకు డుమ్మా’ శీర్షికతో ‘దిశ’ దిన పత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది.

Update: 2024-10-22 02:34 GMT

దిశ, పల్నాడు: సచివాలయాల్లో సమయపాలన లేకుండా ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్న వార్డు సచివాయాల ఉద్యోగుల పని తీరును శనివారం ‘విధులకు డుమ్మా’ శీర్షికతో ‘దిశ’ దిన పత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. సత్తెనపల్లి మున్సిపల్ మేనేజర్ సాంబశివరావు సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

7, 13 సచివాలయాల్లో ఉద్యోగుల పని తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు అలస్యంగా బయోమెట్రిక్ వేస్తున్నట్లుగా గుర్తించారు. మూవ్‌మెంట్ రిజిస్టర్‌లో ఫీల్డ్ డ్యూటీ సమాచారాన్ని నమోదు చేయకపోవడంపై మండిపడ్డారు. ఆలస్యంగా విధులకు హాజరు అవుతున్న ఉద్యోగుల వివరాలను నమోదు చేసుకున్నారు. మెమోలు జారీ చేస్తామని హెచ్చరించారు. విధి నిర్వహణలో ఉద్యోగులు ప్రజలకు జవాబుదారీ ఉండాలని సూచించారు.

ఆగమేఘాల మీద విధులకు..

‘దిశ’ కథనంతో బెంబేలెత్తిన ఉద్యోగులు సోమవారం ఆగమేఘాల మీద విధులకు హాజరయ్యారు. డ్యూటీ టైం కంటే ముందే కనిపించారు. మొన్నటి దాకా పత్తా లేకుండా పోయిన ఉద్యోగులు సచివాలయాల్లో అన్ని సీట్లలో దర్శనమిచ్చారు. అదేవిధంగా సందర్శకులు తమ సేవలకు సంబంధించిన దరఖాస్తులను అధికారులకు అందజేశారు.


Similar News