చంద్రబాబు హెల్త్ కండిషన్‌పై DIG రవికిరణ్ కీలక ప్రకటన
రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని.. ఆయన 5 కేజీల బరువు తగ్గారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని.. ఆయన 5 కేజీల బరువు తగ్గారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై డీఐజీ రవి కిరణ్ క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. జైల్లో ఎప్పటికప్పుడూ చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
ఆయన కొంత డీహైడ్రేషన్‌కు గురైంది వాస్తవమేనని.. కానీ వెంటనే జైలులోని వైద్యులు ఆయనకు చికిత్స అందించారని చెప్పారు. బయట జరుగుతున్నట్లుగా చంద్రబాబుకు అంత సీరియస్‌గా లేదన్నారు. ప్రస్తుతం చంద్రబాబు 67 కిలోల బరువు ఉన్నారని చెప్పారు. జైలులో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ వలన చంద్రబాబు అస్వస్థతకు గురైనట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాగునీటి సమస్య ఉంటే.. జైలులో ఉన్న మరో 2 వేల మంది ఖైదీలకు కూడా హెల్త్ ఇష్యూస్ రావాలి కదా అని ప్రశ్నించారు.
చంద్రబాబు వ్యవహారంలో తమపై ఎటువంటి ఒత్తిడి లేదన్నారు. జైలులో చంద్రబాబు కనుచూపు మేరలో కూడా ఎవరినీ అనుమతించడం లేదని.. ఆయన దగ్గరకు వెళ్లాలంటే ఏడుగురిని దాటుకుని వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి రోజు చంద్రబాబు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని తెలిపారు. ఇకపై చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.