AP:జగన్ పాలనలో సాగునీటి వనరుల విధ్వంసం..మంత్రి నిమ్మల ధ్వజం

మాజీ సీఎం వైఎస్ జగన్ తన అరాచక పాలనలో సాగునీటి వనరులు నిర్వీర్యం చేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు విమర్శించారు.

Update: 2024-07-02 15:00 GMT

దిశ,ఏలూరు:మాజీ సీఎం వైఎస్ జగన్ తన అరాచక పాలనలో సాగునీటి వనరులు నిర్వీర్యం చేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు విమర్శించారు. మంగళవారం పోలవరం వచ్చిన ఆయన ప్రాజెక్ట్‌ని సందర్శించారు. తొలుత ప్రాజెక్టులో గత మూడు రోజులుగా క్షేత్ర స్థాయి పరిశీలనలు చేస్తున్న విదేశీ నిపుణుల బృందంతో, ఇంజనీరింగ్ అధికారులతో పోలవరం ప్రాజెక్టు సమావేశ మందిరంలో కలిసి చర్చించారు. అనంతరం ప్రాజెక్టు స్పిల్ వే పై నుండి అప్రోచ్ ఛానల్‌లో వస్తున్న వరద జలాలను పరిశీలించారు. స్పిల్ వేలో ఫిష్ ల్యాడర్ ప్రాంతాలను పరిశీలించారు, ఫిష్ ల్యాడర్ ద్వారా చేపలు స్పిల్ వే ఎగువకు చేపలు ఏ విధంగా ప్రయాణిస్తాయి అనే విషయాలపై ఈఈ మల్లిఖార్జునరావు ఇతర ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎగువ కాపర్ డ్యాం పై నుంచి ఎర్త్ కం రాక్ఫెల్ డ్యాం ప్రాంతాన్ని పరిశీలించారు.

వరద నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో దిగువ కాపర్ డ్యాం కుడి వైపున సీపేజీ జలాలు బయటకు పోవడానికి తవ్విన స్లూయిజ్ కాలువ ప్రాంతంలో స్పిల్ వే జలాలు ఎగువ దిగువ కాపర్ డ్యాం లోపలికి రాకుండా శాండ్ ఇసుక బస్తాలు కాకుండా మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డివిజన్ 6 ఈఈ పాండురంగయ్య మెగా కంపెనీ గుత్తేదారులకు సూచించారు. అనంతరం భోజన విరామం తర్వాత జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాయలసీమ, కృష్ణా డెల్టాకు సాగునీరు తాగునీరు అందించాలనే మంచి దృక్పదంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటి పంపిణీ బుధవారం ఉదయం ప్రారంభించనున్నట్లు తెలిపారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం నుండి 890 క్యూసెక్కులు, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుండి 1000 క్యూసెక్కుల జలాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ప్రతి ఏటా మూడు వేల క్యూసెక్కుల వరద జలాలు వృధా అవుతున్నాయని వాటిని వృధా కాకుండా ప్రతి చుక్కా రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించిన మేరకు ఎత్తిపోతల పథకాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 2019 లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే 2020 నాటికి పోలవరం పూర్తి చేసి ఉండేవారని అన్నారు. పోలవరానికి జగన్ ఒక శాపమని, గడిచిన ఐదేళ్లలో ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసం చేసి ప్రాజెక్టులో ప్రతి పనిని డబుల్ అయ్యేలా చేశారన్నారు. పోలవరం పూర్తయ్యేలోపు రైతులు సాగు, తాగు నీటికి ఇబ్బందులు పడకూడదనే మంచి ఆలోచనతో చంద్రబాబు పట్టిసీమ నిర్మించి లక్షలాది ఎకరాలకు సాగు నీరిస్తే పట్టిసీమను ఒట్టిసీమ అని అసెంబ్లీ సాక్షిగా జగన్ విమర్శించారన్నారు. ఇప్పుడు అదే పట్టిసీమ బంగారు సీమ గా మారి రాయలసీమ కృష్ణా డెల్టాకు సాగు తాగు నీటికి ఆధారంగా మారిందన్నారు. ప్రస్తుతం 30 లక్షల ఎకరాలకు సాగునీరు తాగునీరు కృష్ణా డెల్టాకు అందిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో ఇతర రిజర్వాయర్లు నిండితేనే ఆగష్టులో నీరు వస్తుందని అలాంటి పరిస్థితుల్లో పట్టిసీమ ద్వారా జూన్ జూలై నెలల్లో నీరందించామన్నారు. పులిచింతలలో సాధారణంగా 30 నుండి 35 టీఎంసీల నీరు నిల్వ ఉండేదని జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కేవలం అర టిఎంసి నీరు మాత్రమే ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టులో విదేశీ నిపుణుల బృందం ప్రాజెక్టులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి విస్తృత పరిశీలనలు చేస్తుందని త్వరలోనే ప్రాజెక్టుకు సంబంధించి మంచి సలహాలు సూచనలు నివేదిక రూపంలో కేంద్రానికి అందిస్తారన్నారు. మంత్రి వెంట పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు, ఏలూరు మాజీ జెడ్పిటిసి చైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు తదితరులు ఉన్నారు.

Similar News