డీఫార్మసీ షెడ్యూల్ విడుదల: సీట్ల కేటాయింపుల తేదీలివే
పాలిటెక్నిక్ కళాశాలల్లో డిఫార్మసీ కోర్సుకు సంబంధించిన ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ విడులైంది.
దిశ, డైనమిక్ బ్యూరో: పాలిటెక్నిక్ కళాశాలల్లో డిఫార్మసీ కోర్సుకు సంబంధించిన ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ విడులైంది. ఈ మేరకు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, ప్రవేశాల కన్వీనర్ చదలవాడ నాగరాణి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఇంటర్మీడియట్ అర్హతతో పాలిటెక్నిక్ కళాశాలల్లో రెండేళ్ల డిప్లమో ఇన్ ఫార్మసీ అడ్మిషన్ల కోసం ఈ నెల 29,30 తేదీలను అన్ లైన్ లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ధృవీకరణ పత్రాల వెరిఫికేషన్ కోసం నిర్దేశించామని తెలిపారు. నవంబరు 30 నుండి డిసెంబర్ 2 వరకు మూడు రోజుల పాటు విద్యార్థులు తమ ఐచ్చికాలను నమోదు చేసుకోవచ్చని, నాలుగవ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. డిసెంబర్ 5,6,7 తేదీలలో సీట్లు పొందిన వారు అయా సంస్ధలలో వ్యక్తిగతంగా రిపోర్టు చేయవలసి ఉందని, అయితే ఇప్పటికే విద్యా సంవత్సరం ఆలస్యం అయిన నేపథ్యంలో ఐదో తేదీ నుండే క్లాసులు ప్రారంభం అవుతాయని నాగరాణి వివరించారు. మరిన్ని వివరాల కోసం https:/apdpharm.nic.in వెబ్ సైట్‌ను సందర్శించాలని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, ప్రవేశాల కన్వీనర్ చదలవాడ నాగరాణి సూచించారు.
ఫార్మా కోర్సులకు బైపీసీ విభాగం నుండి తుదిదశ సీట్ల కేటాయింపు
ఫార్మసీ కోర్సుల కోసం ఇంటర్మీడియట్ బైపీసీ విభాగం నుండి నిర్దేశించిన తుది దశ సీట్ల కేటాయింపును సోమవారం పూర్తి చేసినట్లు ఏపీఈఏపీ సెట్-2023 ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. డిఫార్మాశీ, ఫార్మా డి, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి 9951 మంది తమ ఐచ్చికాలను నమోదు చేసుకోగా, 3345 మందికి నూతనంగా సీట్లు కేటాయించామన్నారు. ఇప్పటికే తరగతులు ప్రారంభం అయినందున వీరు తక్షణమే అయా కళాశాలల్లో రిపోర్టు చేయాలని ఏపీఈఏపీ సెట్-2023 ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు.