బీఆర్ఎస్-వైసీపీల చీకటి దోస్తీ:కేసీఆర్‌కు లబ్ధి చేకూర్చేలా వైసీపీ అస్త్రం
బీఆర్ఎస్ పార్టీకి ఏపీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరిస్తోందా? గత ఎన్నికల్లో ఇరు పార్టీలు ఇచ్చుపుచ్చుకున్నారా?
దిశ, డైనమిక్ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీకి ఏపీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరిస్తోందా? గత ఎన్నికల్లో ఇరు పార్టీలు ఇచ్చుపుచ్చుకున్నారా? 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థిక వనరులు సమకూర్చారా? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని వైసీపీ.. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ కోరుకుంటుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేననే ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి కేసీఆర్ సీఎం జగన్‌కు ఎంతో సహకరించారని ఇప్పటికే ప్రచారం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరగనున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ జలవివాదం తెరపైకి వచ్చింది. అకస్మాత్తుగా ఈ వ్యవహారం తెరపైకి రావడానికి తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించిందని అందుకు ఏపీ ప్రభుత్వం సహకరించిందని అటు తెలంగాణ ఇటు ఏపీలోని పలు పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అంతేకాదు తెలంగాణ ఎన్నికలకు ఏపీ ఎన్నికలకు ముడిపెడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇక వైఎస్ జగన్ ఇంటికేనని.. ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మరోసారి జగన్ కూడా ముఖ్యమంత్రి అవుతారనే సరికొత్త ప్రచారం మెుదలైంది.
సెంటిమెంట్ కోసమే వివాదమా?
నాగార్జున సాగర్ వివాదం ఇప్పుడు రాజకీయ అస్త్రంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో కలిసి ఈ సరికొత్త వివాదానికి శ్రీకారం చుట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు లేని ఉద్రిక్త పరిస్థితులు నాగార్జున సాగర్ వద్ద రాత్రికి రాత్రే ఏర్పడటానికి గల కారణాలేంటని ప్రశ్నిస్తున్నాయి. అక్కడ అంతలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు దాన్ని సరిదిద్దాల్సింది పోయి జలాలు విడుదల చేస్తామని రెచ్చగొట్టేలా ట్వీట్ చేయడం ఈ కుట్రలో భాగమేనని అటు తెలంగాణలోని విపక్షాలతోపాటు ఏపీలోని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదంతా రాజకీయ ఎత్తుగడ అని..ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు కేసీఆర్ వేసిన సెంటిమెంట్ స్కెచ్ అని అంటున్నారు. ఈ సెంటిమెంట్ డ్రామాలను తెలంగాణ ప్రజలు ఇక నమ్మరని తెలంగాణ కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డితోపాటు పలువురు విమర్శలు చేస్తున్నారు.
ఇప్పుడు ఏం ఆశించి హడావిడి: పురంధేశ్వరి
ఇకపోతే నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. నాగార్జున సాగర్ వద్దకు పోలీసులను పంపడం చాలా ఘోరంగా అభివర్ణించారు. నాలుగున్నరేళ్లుగా పట్టించుకోకుండా ఇప్పుడు ఎందుకు హడావుడి ఏం ఆశించి చేస్తున్నారని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలను దగ్గుబాటి పురంధేశ్వరి ఖండించారు. రాష్ట్రంలో 400 మండలాల్లో కరవు విలయ తాండవం చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. కరవు విషయం లో క్యాబినెట్‌లో కూడా చర్చ లేదు. ఏపీలో వ్యవసాయ శాఖ మంత్రి ఎవరంటే వెతుక్కునే పరిస్థితి ఉందని అన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి ఎవరంటే మాత్రం చెబుతున్నారు...కానీ రైతులను ఆదుకోవడంలో మాత్రం ఆ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్తున్నారని పురంధేశ్రి చెప్పుకొచ్చారు. ఇరిగేషన్, వ్యవసాయ మంత్రుల పనితీరు రైతులకు ఆమోద యోగ్యంగా లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు.
రాజకీయ కుట్రలో భాగమే వివాదం: సీపీఐ
తెలుగు ప్రజలకు అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇటు ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్ ద్రోహం చేసేలా ప్రవర్తిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. వీళ్లతో పాటు బీజేపీ కూడా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ ముగ్గరూ కలిసి పోలింగ్ వేళ రాజకీయ లబ్ధిపొందేలా నాగార్జున సాగర్ వద్ద అర్ధరాత్రి హంగామా సృష్టించారని మండిపడ్డారు. నీటి వివాదం కొత్తది కాదని.. కానీ, రాజకీయ లబ్ధి కోసమే పోలింగ్‌కు ముందు రోజు వివాదం క్రియేట్ చేశారని అన్నారు. కేవలం ఇది తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టే కుట్రే అని తేల్చి చెప్పారు. రాజకీయ కుట్రలను తెలుగు ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు.
అసలేం జరిగిందంటే!
తెలంగాణ ఎన్నికల వేళ నాగార్జున సాగర్ వద్ద బుధవారం రాత్రి హై టెన్షన్ నెలకొంది. ఏపీకి చెందిన 500 మంది పోలీసులు నాగార్జున సాగర్ వద్ద హల్ చల్ చేశారు. ప్రాజెక్టుకు ఉన్న మొత్తం 26 గేట్లలో సగభాగం అంటే 13వ గేటు వరకు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసులు ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీఎస్పీఎఫ్ సిబ్బంది ఏపీ పోలీసులను అడ్డుకున్నారు. దీంతో స్వల్పంగా ఘర్షణకు దారి తీసింది. ఈ అంశంపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోలింగ్‌కు ముందు రోజు కావాలనే సెంటిమెంట్‌ను రగిల్చేందుకే వ్యుహాత్మకంగా వివాదం సృష్టించారని బీఆర్ఎస్‌పై ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గురువారం ఇదే అంశంపై ఓ ట్వీట్ చేశారు. ‘తాగు నీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ రైట్ కెనాల్‌కి నేడు నీరు విడుదల చేయనున్నాము!’ అంటూ సంచలన కామెంట్ పెట్టారు. అయితే ఇరు రాష్ట్రాల మధ్య వివాదాన్ని మరింత పెంచేలా అంబటి చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్నందున కావాలనే కేసీఆర్ కు లబ్ధి చేకూరేలా ఇలా వైసీపీ ప్లాన్ చేసిందని తెలుగు రాష్ట్రాలలోని విపక్షాలు భగ్గుమంటున్నాయి.