విశాఖకు క్రికెట్ ఫీవర్..టికెట్ల కోసం ఎగబడ్డ అభిమానులు

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ నడుస్తోంది. వరల్డ్‌కప్ నేపథ్యంలో కప్ ఎవరి వరం అవుతుందా? అని ప్రపంచం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

Update: 2023-11-17 07:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ నడుస్తోంది. వరల్డ్‌కప్ నేపథ్యంలో కప్ ఎవరి వరం అవుతుందా? అని ప్రపంచం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఇలా ప్రపంచం అంతా క్రికెట్‌ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో విశాఖకు క్రికెట్ ఫీవర్ తగిలింది. వరల్డ్ కప్ అయిన వెంటనే టీమిండియా, ఆస్ట్రేలియాల మధ్య టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.టీమిండియా, ఆసీస్‌ల మధ్య 5 టి20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 3 వరకు ఈ సిరీస్ జరగనుంది. అయితే ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు విశాఖ ఆతిథ్యమిస్తోంది. ఈ నెల 23న విశాఖలోని మధురవాడ స్టేడియంలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు టీ20 మ్యాచ్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఇప్పటికే ఆన్‌లైన్ టికెట్ల విక్రయాలు జరిగిపోయాయి. తాజాగా ఆఫ్‌లైన్ టికెట్ల విక్రయాలు ప్రారంభం అయ్యాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు మధురవాడ స్టేడియంతో పాటు మున్సిపల్ స్టేడియం, గాజువాక ఇండోర్ స్టేడియంలోనూ టికెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రూ.600, రూ.1500, రూ.2000, రూ.3000, రూ.3500 ధరల శ్రేణిలో టికెట్ల విక్రయాలు చేపట్టారు. దీంతో టికెట్లు కొనుగోలు చేసేందుకు క్రీడా అభిమానులు తరలివచ్చారు. టికెట్ల కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. దీంతో విశాఖలో సందడి వాతావరణం కనిపిస్తోంది. ఇకపోతే క్రికెట్ అంటే పడిచచ్చే అభిమానులు అయితే ఏకంగా గురువారం రాత్రి నుంచి కౌంటర్ల వద్ద నిద్రపోతున్నారు. ఇకపోతే శుక్రవారం ఉదయం నుంచే మహిళా అభిమానులు సైతం టికెట్ల కోసం క్యూలైన్లో క్యూ కట్టారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు టికెట్ల అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో టికెట్లు హాట్ కేక్‌లా అమ్ముడుపోతున్నాయి. అయితే గంటల వ్యవధిలోనే రూ.600 టికెట్లు పూర్తిగా అమ్ముడు పోయాయని తెలుస్తోంది. ఆన్ లైన్‌లో టికెట్లు అయిపోవడంతో కనీసం ఆఫ్‌లైన్‌లో అయినా దక్కించుకునేందుకు ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎగబడ్డారు.

Tags:    

Similar News