మోడీ పాలనలో సీబీఐ విశ్వసనీయత కోల్పోయింది.. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి
మోడీ పాలనలో సీబీఐ విశ్వసనీయత కోల్పోయిందని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ తులసిరెడ్డి ఆరోపించారు.
దిశ, కడప: మోడీ పాలనలో సీబీఐ పూర్తిగా విశ్వసనీయత కోల్పోయిందని మాజీ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. సీబీఐ దేశంలోనే సర్వోన్నత దర్యాప్తు సంస్థ అని, ఈ సంస్థ 1963 లో ఏర్పాటు అయిందని, ప్రత్యక్షంగా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఈ సంస్థ ఉంటుందని అన్నారు. మోడీ పాలనలో తన లక్ష్యాలను పూర్తిగా విస్మరించిందన్నారు. తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డిని పులివెందుల పట్టణంలో ఇంటిలో అరెస్టు చేసిన సిబిఐ అధికారులు కొడుకు అవినాష్ రెడ్డిని కర్నూలులో అరెస్టు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండడం విడ్డూరం అన్నారు.
జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్, మనీష్ సిసోడియా, వైయస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లను అరెస్టు చేసిన సీబీఐ.. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయలేని నిస్సహాయ దుస్థితిలో ఉండడం విచారకరమన్నారు. తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు ఉత్పన్నం కాని శాంతిభద్రతల సమస్య కొడుకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే ఉత్పన్నమవుతుందని రాష్ట్ర పోలీస్ యంత్రాంగం చెప్పడంలో హేతుబద్ధత లేదన్నారు. తల్లిని హైదరాబాద్ కు తీసుకుని పోయి మెరుగైన వైద్యం అందించాల్సింది పోయి కర్నూలులోనే ఉంచడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా సీబీఐ తన విశ్వసనీయతను నిరూపించుకోవాలని తులసి రెడ్డి సూచించారు.
Also Read..
బ్రేకింగ్: సుప్రీంకోర్టులో MP అవినాష్ రెడ్డికి మరోసారి చుక్కెదురు