AIADMK: నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఎంజీఆర్ : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

1972, అక్టోబర్ 17న పురచ్చి తలైవర్ గా పిలుచుకునే ఎంజీఆర్ (MGR) అన్నాడీఎంకే ను స్థాపించారని, ఆయన కృషితో ఈ పార్టీ తమిళనాట తిరుగులేని రాజకీయశక్తిగా ఎదిగిందన్నారు పవన్ కల్యాణ్.

Update: 2024-10-17 07:30 GMT

దిశ, వెబ్ డెస్క్: అన్నాడీఎంకే (AIADMK) పార్టీ 53వ వార్షికోత్సవం సందర్భంగా.. ఆ పార్టీ నాయకత్వానికి, నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా ఎంజీఆర్, జయలలిత ఫొటోలను షేర్ చేసి ఓ పోస్ట్ చేశారు.1972, అక్టోబర్ 17న పురచ్చి తలైవర్ గా పిలుచుకునే ఎంజీఆర్ (MGR) అన్నాడీఎంకే ను స్థాపించారని, ఆయన కృషితో ఈ పార్టీ తమిళనాట తిరుగులేని రాజకీయశక్తిగా ఎదిగిందన్నారు. తాను అత్యంత గౌరవంగా చూసే నాయకుల్లో ఎంజీఆర్ ఒకరని తెలిపారు. పేదల అభ్యున్నతికి కట్టుబడి, ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించే హక్కు ఉందని భరోసా ఇచ్చారన్నారు. ఆయన దూరదృష్టిపాలన, సంక్షేమ అభివృద్ధే తమిళనాడును దేశంలో అత్యంత సంపన్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలబెట్టిందన్నారు. ఆయన నాయకత్వం తక్షణ అవసరాలను తీర్చడమే కాకుండా.. స్థిరమైన పురోగతికి బలమైన పునాది వేసిందన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ర్ట అభివృద్ధికి ఆయన నిబద్ధత శాశ్వత వారసత్వంగా నిలిచిపోయిందని పేర్కొన్నారు పవన్ కల్యాణ్. ఎంజీఆర్ పాలన తనకెప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉందని, అలాగే ఉంటుందని తెలిపారు.

అసాధారణమైన నాయకత్వంతో.. ఎంజీఆర్ దార్శనికతను పురచ్చి తలైవిగా పిలుచుకునే జయలలిత (Jayalalitha) ముందుకు తీసుకెళ్లారని కొనియాడారు పవన్ కల్యాణ్. జయలలిత పరిపాలనలో ఎంజీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ప్రజల్లో అమ్మగా శాశ్వతమైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారని గుర్తు చేశారు. అమ్మ క్యాంటీన్లతో ప్రజల ఆకలిని తీర్చిన అన్నపూర్ణగా నిలిచిపోయారని, పొరుగు రాష్ట్రాలతో సామరస్య సంబంధాలను పెంపొందించడంలో ఆమె చేసిన కృషి, తెలుగు భాషపట్ల ఆమెకున్న గౌరవం ఎప్పటికీ మరచిపోలేనివన్నారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వం సైతం అన్నాడీఎంకే కోసం ఎనలేని కృషి చేశారన్నారు. జయలలిత మరణం తర్వాత పన్నీర్ సెల్వం సీఎంగా బాధ్యతలు చేపట్టి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించాలని, ఆమె అడుగుజాడల్లో ఇప్పటికీ నిజాయితీగా నడుస్తున్నారన్నారు.

తమిళనాడు ప్రజలకు సేవ చేయడం, ఎంజీఆర్ ఆశయాలను నెరవేర్చడం, ప్రజా ఆకాంక్షలను తీర్చడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అన్నాడీఎంకే మరిన్ని శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తమిళ భాష, సంస్కృతి పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని, తమిళుల అలుపెరగని పోరాట పటిమ అంటే గౌరవమని చెప్పారు.  


Similar News