జైలులో పరిస్థితులు నా భర్తకు తీవ్రముప్పు తలపెట్టేలా ఉన్నాయి : Nara Bhuvaneshwari
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ట్వీట్ చేశారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో తన భర్త చంద్రబాబు ఆరోగ్యంపై తాను ఆందోళన చెందుతున్నట్లు వెల్లడించారు. జైల్లో తన భర్తకు సకాలంలో అత్యవసరం వైద్యం అందించడంలో ఏపీ ప్రభుత్వం వైఫల్యం చెందింది అని భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారు అని వెల్లడించారు. ఇంకా చంద్రబాబు నాయుడు 2 కిలోల బరువు తగ్గితే ఆయన కిడ్నీలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో ఓవర్ హెడ్ ట్యాంక్‌లు అపరిశుభ్రంగా ఉన్నాయని దాని ఫలితంగా చంద్రబాబు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో చంద్రబాబు తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఈ భయంకర పరిస్థితులు తన భర్తకు ప్రాణానికి తీవ్ర ముప్పు తలపెట్టేలా కనిపిస్తున్నాయి అని నారా భువనేశ్వరి ట్విటర్ వేదికగా వెల్లడించారు.
డీహైడ్రేషన్‌తో బాధపడుతున్న చంద్రబాబు
ఇకపోతే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు నాయుడు స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నారు. కొన్నేళ్ల నుంచి చర్మ సంబంధ సమస్యలతో చంద్రబాబు బాధపడుతున్నారు. అయితే వాతావరణ మార్పుల వల్ల డీహైడ్రేషన్‌తో ఇబ్బందులు పడ్డారు. తాజాగా చంద్రబాబుకు చర్మ సంబంధ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో జైలు అధికారులు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి నుంచి ప్రత్యేకంగా డెర్మటాలజిస్టును పిలిపించి పరిశీలించారు. జైలులో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబుకు స్కిన్ సమస్య తీవ్రమైనట్లు వైద్యులు నిర్ధారించారు. చర్మంపై పలుచోట్ల దద్దుర్లు, ఇన్‌ఫెక్షన్‌తో ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు ఎక్కువ మొత్తంలో బరువు తగ్గినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారించినట్లు తెలుస్తోంది. బరువు తగ్గడాన్ని వైద్యులు సీరియస్‌గా తీసుకోవాలంటున్నారు. డీహైడ్రేషన్ ఇతర సమస్యలకు దారితీయవచ్చని వైద్యులు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబసభ్యులు, పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.