Collector Nagarani: రేపు అన్ని పాఠశాలలకు సెలవు
వర్షం కారణంగా జిల్లాలోని అన్ని స్కూళ్లకు కలెక్టర్ నాగరాణి సెలవు ప్రకటించారు...
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో చాలా ప్రాంతాల్లో భారీ నష్టం జరిగింది. వాగులు, వంకలు ఉప్పొంగి ఊళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినా పలు జిల్లాలపై దాని ప్రభావం కొనసాగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. దీంతో జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది. జిల్లాలోని అన్ని స్కూళ్లకు కలెక్టర్ నాగరాణి మంగళవారం సెలవు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా సెలవు ప్రకటిస్తున్నట్లు ఆమె తెలిపారు. వర్షాలు తగ్గే వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత వాసులు పునరావాసాలకు వెళ్లాలని సూచించారు. జిల్లాలో వర్షాల కారణంగా వచ్చే వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఇక పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పటికే కురిసిన వర్షంతో చాలా చోట్ల పంటలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. వాగులు పొంగడంతో రోడ్లపైకి భారీగా వరద ప్రవాహం చేరింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎగువన కురిసిన వర్షాలకు అటు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవాహం చేరింది. దీంతో జలశయాలన్నీ నిండుకుండలా మారాయి.