జీతం కోసం ఆంగ్లం.... జీవితం కోసం తెలుగు: చంద్రబాబు
జీతం కోసం ఆంగ్లమని, జీవితం కోసం తెలుగు నేర్పిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో ప్రభుత్వం నిర్వహించిన అధికార భాషా దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యావహారిక భాషోద్యమ పితామహుడు శ్రీ గిడుగు వెంకట రామమూర్తికి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జీతం కోసం ఆంగ్లమని.... జీవితం కోసం తెలుగు నేర్పిస్తామని చెప్పారు. ‘‘తెలుగు భాషకు ఘన చరిత్ర ఉంది. దేశంలో అత్యధికులు మాట్లాడే భాషలో నాలుగో భాష తెలుగుభాష. 10 కోట్ల మంది మాట్లాడే భాష తెలుగు కావడం గర్వకారణం. హిందీ, బెంగాళీ, మరాఠీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగుభాష. అమెరికా లాంటి దేశంలో తెలుగు 11వ భాష అంటే అది తెలుగువారి సత్తా. ఇంగ్లీష్ వస్తేనే మనకు ఉద్యోగాలు, డబ్బులు వస్తాయని భావిస్తున్నారు. ఇటీవల ఈ తరహా పిచ్చి పెరిగింది. అలాంటి అపోహలు నమ్మవద్దు. బాల్యంలో మనమందరం ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాం. నాడు ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరిగింది. ప్రపంచంలో ఏదేశానికి వెళ్లినా ఎక్కువ సంపాదన సంపాదించేది భారతీయులే. అందులో తెలుగువారు 30 శాతం ఉన్నారు. అది తెలుగుజాతికే గర్వకారణం. తెలుగు చదువుకొని తర్వాత సంపాదన కోసం ఇంగ్లీష్ నేర్చుకున్నారు.’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
‘‘తెలుగు కోసం గిడుగు రామ్మూర్తి పంతులు పోరాటం చేశారు. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారు. ఆయన కృషిని మరవలేం. తెలుగు రాష్ట్రం వచ్చిందంటే పొట్టిశ్రీరాములు వల్లే అని మదరాసీలుగా పిలువడిన మనం తెలుగుదేశం పార్టీ స్థాపన తర్వాత తాము మదరాసీలం కాదు తెలుగువారం ఒకరున్నాం అని తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు నందమూరి తారకరామారావు. దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు అభివర్ణించారు. తెలుగు భాష కోసం సీపీ బ్రౌన్ లాంటి విదేశస్తులు ఎంతో కృషి చేశారు. తెలుగు భాషను కాపాడటం కోసం, తెలుగు భాష వ్యాప్తి కోసం పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించి పెద్దఎత్తున ప్రయత్నం చేశారు. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం మైసూర్‌లో ఉంటే ఏపీలో పెట్టాలని పోరాడి నెల్లూరు జిల్లా వెంకటాచలం ప్రాంతానికి మార్పించాం. తెలుగు భాషాభివృద్ధి కోసం 2016 సెప్టెంబర్ 14న తెలుగుదేశం పార్టీ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు గత 5 ఏళ్ల కాలంలో ఉన్న ప్రభుత్వం ఇంగ్లీష్ నేర్చుకుంటేనే జీవితం అన్నట్లుగా మార్చేసింది. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నాం. నేటి ఆదాయానికి, 2047లో వచ్చే ఆదాయానికి చాలా వ్యత్యాసం వస్తుంది. ప్రపంచంలో తెలుగువారు దేనికీ తక్కువకాదని 2047 నాటికి అంటే స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు అయ్యే సందర్భంగా భారతదేశం ప్రపంచంలో అగ్రదేశంగా మొదటి, రెండు స్థానాల్లో ఉంటుంది.’’ అని చంద్రబాబు తెలిపారు.