త్వరలో నెంబర్‌వన్‌గా ఏపీ: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
త్వరలో ఏపీని నెంబర్ వన్‌గా చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు...

దిశ, వెబ్ డెస్క్: త్వరలో ఏపీ(Ap)ని నెంబర్ వన్‌గా చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు(Tanuku)లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర(Swarnadhra-Swachandhra) తన జీవిత లక్ష్యమని చెప్పారు. ప్రజారోగ్యం కోసమే స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర ప్రజలంతా ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. పరిసర ప్రాంతాలను ప్రతిఒక్కరూ శుభ్రంగా ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రోడ్లపై ప్రతి రోజు 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పోస్తుందని, 51 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మున్సిపల్ సిబ్బంది సేకరిస్తున్నారని తెలిపారు. అక్టోబర్ 2న నాటికి ఎక్కడా చెత్త కనిపించకుండా చేస్తామని, ఆ బాధ్యతను మంత్రి నారాయణకు అప్పగించామని చంద్రబాబు పేర్కొన్నారు. ఆత్మగౌరవం పేరుతో గతంలో మరుగుదొడ్లు నిర్మాణానికి పిలుపునిచ్చానని చెప్పారు. 4 లక్షల 60 వేల మరుగుదొడ్లను మళ్లీ నిర్మించబోతున్నామన్నారు. ఇప్పటికే 72 వేల మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రారంభించినట్లు చంద్రబాబు వెల్లడించారు.
‘‘హక్కులు అడిగే వాళ్లు బాధ్యతగా ఉండాలని, చురుకుగా పని చేసిన వారికి అన్ని దక్కుతాయి. గత ముఖ్యమంత్రి ప్రజల్లోకి ఒక్కసారైనా వచ్చారా?. పరదాలు కట్టుకుని మాత్రమే బయటకు వచ్చారు. విమానంలో వస్తే చెట్లను నరికేవాళ్లు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఒప్పుకునే వాళ్లు కాదు. మాది ప్రజా ప్రభుత్వం. సమస్యలు వినేందుకే నేను వచ్చా. పాలనలో సంస్కరణలు తెస్తాం. రాష్ట్రానికి పది లక్షల కోట్ల అప్పు ఉంది. అప్పుతో పాటు వడ్డీ కూడా కట్టాల్సి వస్తోంది. గత సీఎం వైఎస్ జగన్ (Ys Jagan) రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో ముందుక వెళ్తున్నాం. పేదల పింఛన్ ను రూ. 3 వేల నుంచి 4 వేలకు పెంచాం. గతంలో రూ. 200 నుంచి రూ. 2000లకు పెంచాం. దివ్యాంగులకు రూ. 3 వేలు నుంచి రూ. 6వేలు అందజేస్తున్నాం.’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.