AP Assembly: వెంటిలేటర్ పై రాష్ట్రం.. 150 రోజుల పాలనపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో 150 రోజుల కూటమి ప్రభుత్వ పాలనపై (150 Days for TDP) ప్రసంగించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఎంత సంచలనం సృష్టించారో.. ఈ ఏడాది ఎన్నికల ఫలితాలు కూడా అంతే సంచలనం సృష్టించాయన్నారు.

Update: 2024-11-20 07:58 GMT

దిశ, వెబ్ డెస్క్: నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత రామ్మూర్తి నాయుడికి ఏపీ అసెంబ్లీ (AP Assembly) సంతాపం తెలిపింది. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో 150 రోజుల కూటమి ప్రభుత్వ పాలనపై (150 Days for TDP) ప్రసంగించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఎంత సంచలనం సృష్టించారో.. ఈ ఏడాది ఎన్నికల ఫలితాలు కూడా అంతే సంచలనం సృష్టించాయన్నారు. ఎన్నో అంచనాలు, ఆశలతో ప్రజలు తమకు ఓట్లు వేసి గెలిపించారన్నారు. ఏపీలో ఏ నేతకూ దక్కని గౌరవం తనకు దక్కిందని, అందరికంటే ఎక్కువసార్లు తనను సీఎంను చేశారని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు.

నాడు బాంబు దాడి నుంచి కాపాడిన శ్రీవారే.. నేడు సీఎం ను చేశారన్నారు. నిండు సభలో తన భార్యను అవమానించడం, తనను జైలుకు పంపడం వంటి ఘటనలన్నింటిపై చంద్రబాబు (CM Chandrababu) ప్రస్తావించారు. తాను ప్రతిక్షణం ప్రజలకోసం పరితపించే వ్యక్తినని, ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తనను గెలిపించిన 21 మంది ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంలో మన పరపతి పెరిగిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని తెలిపారు.

అప్పులే శాపాలు

గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అప్పులు చేసిందన్న చంద్రబాబు.. నేడు అవే రాష్ట్రానికి శాపాలుగా మారాయని వాపోయారు. రాష్ట్రం వెంటిలేటర్ పైకి వెళ్లిందని, ఇప్పుడిప్పుడే రాష్ట్రం ఒక గాడిన పడుతోందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిరంతరం సమీక్షలు చేస్తున్నానన్న చంద్రబాబు.. రాష్ట్రంలో సంక్షేమం టీడీపీతోనే సాధ్యమన్నారు. పేదల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోమని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News