ఏపీలో అధ్వాన్నంగా రోడ్లు.. మరమ్మతులపై సీఎం కీలక ఆదేశాలు
ఏపీలో ఆధ్వాన్నంగా మారిన రోడ్ల మరమ్మతులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు..
ఏపీ బ్యూరో అమరావతి: ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని 5,141 కిలోమీటర్ల మేర రోడ్లు గుంతలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష సమావేశంలో అధికారులు వెల్లడించారు. తక్షణం ఈ గుంతల పడ్డ రోడ్లను పూడ్చాలని సీఎం ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆర్అండ్ బీ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రోడ్ల దుస్థితి, నిధుల అవసరం, ప్రస్తుతం ఉన్న సమస్యలపై సీఎంకు అధికారులు వివరించారు. రాష్ట్రంలో 4,151 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతలు ఉన్నాయని, తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు మరో 2,936 కిలోమీటర్లు మేర ఉన్నాయని వివరించారు. మొత్తంగా రాష్ట్రంలో 7,087 కిలోమీటర్ల పరిధిలో తక్షణం పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని, వీటి కోసం కనీసం రూ.300 కోట్ల నిధులు అవసరం అని తెలిపారు. గుంతలు పూడ్చే పనులు వెంటనే చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. అత్యవసరంగా బాగు చేయాల్సిన రోడ్లపైనా దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. రోడ్ల మరమ్మతులు, నిర్మాణంలో కొత్త, మెరుగైన సాంకేతికతను వినియోగించే విషయంపై తిరుపతి ఐఐటి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, ప్రభుత్వ అధికారులు, నిర్మాణ రంగ నిపుణులతో చర్చించారు. ఆర్ అండ్ బీ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, ఆ శాఖ అధికారులు, నిర్మాణ రంగ నిపుణులు సమీక్షలో పాల్గొన్నారు.