ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొట్టిన పడవలు.. సీఎం చంద్రబాబు ఆగ్రహం

ఇటీవల ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణ నది ఉగ్రరూపం దాల్చింది.

Update: 2024-09-09 15:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణ నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఈ నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండిపోయి.. గేట్లను ఎత్తడంతో విజయవాడలో ఉన్న ప్రకాశం బ్యారేజీకి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరద పోటెత్తింది. దీంతో 70 గేట్లను ఎత్తిన అధికారులు 11 లక్షల క్యూసెక్కుల వరదను సముద్రంలోకి వదిలారు. ఈ సమయంలో ఎగువన ఉన్న మూడు ఇసుక బోట్లు వేగంగా వరదతో కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీ ని ఢీ కొట్టాయి. దీంతో బ్యారేజీ గేట్ల కౌంటర్ వేయిట్ పిల్లర్లకు తగలడంతో అవి పాక్షికంగా డ్యామేజ్ అయ్యాయి. ఈ ఘటనపై ఈ రోజు సీఎం చంద్రబాబు బ్యారేజ్ ను సందర్శించిన అనంతరం అధికారులతో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా.. కృష్ణా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న సమయంలో బ్యారేజ్‌ను పడవలు ఢీకొట్టడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారేజ్‌ దగ్గరకు పడవలు ఎలా వచ్చాయి..? ఎందుకొచ్చాయని అధికారులను ప్రశ్నించారు. ప్రమాద సమయంలో 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ఉంది. ఆ బోట్లు ఒకవేళ నేరుగా పిల్లర్‌ను ఢీకొట్టి ఉంటే ఈ రోజు పరిస్థితి వేరేలా ఉండేది. బోట్లు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో కౌంటర్‌ వెయిట్ విరిగిపోయే పరిస్థితికి వచ్చిందని అన్నారు. అలాగే తప్పులు చేసిన వైసీపీ నాయకులు ఎదురుదాడి చేయడమేంటని, మూడు పడవలకు వైసీపీ రంగులున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.


Similar News