CM Chandrababu: ప్రజా‌వేదిక కూల్చివేతతో వైసీపీ విధ్వంసం మొదలైంది: సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్

‘ప్రజా‌వేదిక’ కూల్చివేతతోనే గత ప్రభుత్వ విధ్వంసం మొదలైందని సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-05 06:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘ప్రజా‌వేదిక’ కూల్చివేతతోనే గత ప్రభుత్వ విధ్వంసం మొదలైందని సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇవాళ అమరావతి వేదికగా ఆయా జిల్లాల కలెక్టర్లతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని అన్ని రంగాలను నిర్వీర్యం చేశారని ఫైర్ అయ్యారు. కలెక్టర్లతో కాన్ఫరెన్స్ పెట్టి మరీ ‘ప్రజావేదిక’ను కూల్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ అకృత్యాలను చూసిన ప్రజలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో వాళ్లకు సరైన గుణపాఠమే చెప్పారని అన్నారు. గత ప్రభుత్వ విధ్వంసం, బెదిరింపులు చూశామని నేటి నుంచి అవన్ని ఉండవని అన్నారు.

చిన్న తప్పు జరిగితే.. సరి చేయొచ్చేమో కానీ, విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే ఎంతో కష్ట పడాల్సి ఉంటుందని తెలిపారు. మన తీసుకునే నిర్ణయాలకు రాష్ట్ర భవిష్యత్తును మార్చే శక్తి ఉందని పేర్కొన్నారు. 2047 వరకు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎకానమీగా ఇండియా అవిర్భవించబోతోందని తెలిపారు. లెక్కల్లోను మనమే దిట్ట అని, జీరోను కనిపెట్టింది మనమే అంటూ చమత్కరించారు. ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం సంపాదించేది భారతీయులేనని తెలిపారు. అందులో 33 శాతం తెలుగువాళ్లే ఉండటం శుభ పరిణామమని అన్నారు. గడిచిన పదేళ్లలో అందరం బాధలు పడ్డామని, అందుకే ప్రజలకు కూడా చారిత్రాత్మక తీర్పును ఇచ్చారని పేర్కొన్నారు.

చరిత్రలో ఎన్నడూ రానంత పెద్ద విజయం ఇదేనని.. ప్రజలు గెలిచి మనల్ని గెలిపించారని తెలిపారు. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రజలకు మాట ఇచ్చామని కలెక్టర్లకు గుర్తు చేశారు. గత ఐదేళ్లలో కాలంలో ఒక్కటంటే ఒక్క కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టలేదని.. ఇక నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి కాన్ఫరెన్స్ ఉంటుందని తెలిపారు. తాను కూడా ఇక నుంచి సమయపాలన పాటిస్తానని.. తన పనితీరుపై కూడా రివ్యూ ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరు పని చేయకపోయిన బాధ్యలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక నుంచి కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు వెళ్తామని తెలిపారు. నేటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ చరిత్రను తిరగరాయబోతోందని సీఎం చంద్రబాబు అన్నారు.  

Tags:    

Similar News