పార్టీ ఖాతాల వివరాలు ఇవ్వండి.. టీడీపీ కార్యాలయానికి సీఐడీ నోటీసులు
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌భవన్ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
దిశ , డైనమిక్ బ్యూరో : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌భవన్ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎన్టీఆర్ భవన్ కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ అశోక్ బాబుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. పార్టీ ఖాతాల వివరాలు తెలియజేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈనెల 18లోగా ఖాతాల వివరాలు అందజేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇకపోతే స్కిల్ స్కాం కేసుకు సంబంధించి పార్టీ ఖాతాల్లోకి వచ్చిన విరాళాల వివరాలు కావాలని సీఐడీ అధికారులు అడిగారు. ఇకపోతే స్కిల్ స్కాం కేసు విచారణలో భాగంగా గతంలో కూడా ఎన్టీఆర్ భవన్‌కు సీఐడీ నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. సీఐడీ అధికారులు వేధిస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతుంది. తాజాగా మరోసారి సీఐడీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
గతంలోనూ...
తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు పోలీసులు నోటీసులు ఇవ్వడం ఇదేమీ మెుదటి సారి కాదు. గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో పోలీసులు నోటీసులు ఇచ్చారు. అనంతరం టీడీపీ అనుబంధపత్రికలో వస్తున్న కథనాలపైనా సీఐడీ నోటీసులు ఇచ్చింది. అలాగే స్కిల్ స్కాం కేసులో పార్టీ విరాళాలకు సంబంధించి గతంలోనూ నోటీసులు ఇవ్వగా.. తాజాగా మరోసారి ఇచ్చింది. ఇకపోతే టీడీపీ అనుబంధ పత్రికలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఉద్దేశించి ఒక కథనం వచ్చింది. మంత్రి బుగ్గన ఆస్తులపై ప్రత్యేకంగా ఆ కథనంలో పొందుపరిచారు. 2019 ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్ ఆస్తులు ప్రస్తుతం ఉన్న ఆస్తులను బేరీజువేసుకుంటూ కథనం ప్రచురించారు. దీంతో సీఐడీ అధికారులు టీడీపీ జనరల్ సెక్రటరీ పేరుతో నోటీసులు ఇచ్చి వెళ్లారు. టీడీపీ అనుబంధ పత్రిక ఎడిటర్ ఎవరు?.. నిర్వహణ ఎవరు చూస్తున్నారు? అని ప్రశ్నించినసంగతి తెలిసిందే.