Tirupati: గూడూరులో ఉద్రిక్తత.. ఎస్సై దూషించాడని ఎమ్మెల్సీ ఆగ్రహం
గూడూరు వన్ టౌన్ వద్ద ఎమ్మెల్సీ మేరిగ మురళి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు..
దిశ, గూడూరు: గూడూరులో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం వాతావరణం నెలకొంది. గూడూరు వన్ టౌన్ వద్ద ఎమ్మెల్సీ మేరిగ మురళి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. తమను ఎస్సై దూషించాడని నిరసన వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ నాయకులతో DSP సూర్యనారాయణ రెడ్డి, CI దశరథరామయ్య మాట్లాడి సర్ది చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరిగ మురళి మీడియాతో మాట్లాడుతూ కొందరు ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని చాలా మంది ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తున్నారని చెప్పారు. బ్రిటిష్ కాలం నాటి పోలీసు వ్యవస్థ నడుస్తుందని, అవినీతికి పాల్పడే పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరుతామన్నారు. తమ పార్టీ కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని మురళి తెలిపారు.
అలాగే గూడూరు మున్సిపల్ అధికారిని ఉద్దేశిస్తూ గూడూరులో ఇటుక రాయి పెడితే అక్కడికి కొందరు బ్రోకర్లు వాలిపోతున్నారని తెలిపారు. ప్రతి కట్టడం దగ్గర వసూళ్లకు పాల్పడుతూ బ్రోకర్‌లను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఆ అవినీతి అధికారి తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆయనపై ఎన్నో ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. ఇవన్నీ కూడా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకు వెళ్లి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతానని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ హెచ్చరించారు.