మీ ఓటే మీ భవిష్యత్తు..అభివృద్ధి,సంక్షేమం కావాలంటే వైసీపీని గెలిపించుకోండి:సీఎం జగన్

మీ ఓటే మీ భవిష్యత్తును మారుస్తుంది.రాష్ట్ర అభివృద్ధిని కూడా నిర్దేశిస్తోంది. మీ అభివృద్ధితో పాటు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మీరంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు.

Update: 2024-04-03 14:57 GMT

దిశ ప్రతినిధి,చిత్తూరు:మీ ఓటే మీ భవిష్యత్తును మారుస్తుంది.రాష్ట్ర అభివృద్ధిని కూడా నిర్దేశిస్తోంది. మీ అభివృద్ధితో పాటు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మీరంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. బుధవారం సాయంత్రం పూతలపట్టు బైపాస్ వద్ద నిర్వహించిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఓటర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు జరగబోయే ఎన్నికలు విలువలు విశ్వసనీయతకు మోసానికి మధ్య జరుగుతున్న యుద్ధముగా భావించాలని కోరారు. నిజం ఒకవైపు అబద్ధం మరోవైపు ప్రగతి ఒకవైపు తిరోగమన మరోవైపు అభివృద్ధి ఒకవైపు అసూయ వైపుగా ఉందన్నారు. మంచి ఒకవైపు చెడు మరోవైపు వెలుగు ఒక వైపు చీకటి మరోవైపు ధర్మం ఒకవైపు అధర్మం మరోవైపుగా ఉందన్నారు.

ఇవి ఓటర్లకు రెండు ప్రత్యామ్నాయంగా మిగిలాయన్నారు. ప్రతి ఇంటిలోనూ ఇంటి ఇల్లుపాది ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కోరారు. ఈ ఎన్నికలు జగన్,చంద్రబాబు నాయుడుకు మధ్య జరిగేవి కాదని ప్రజలను మోసం చేసే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు ప్రజలకు మధ్య జరిగే యుద్ధముగా గుర్తించాలని సూచించారు. ఈ యుద్ధంలో తనది ప్రజల పక్షమని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో దత్తపుత్రుడు ఎల్లో మీడియా తో పాటు పలు రకాలుగా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న మిగిలిన పార్టీల నాయకులంతా తనపై ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కలిసి యుద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని జెండాలు పార్టీలు ఒకటై కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారని విమర్శించారు. ఈ యుద్ధంలో మీ బిడ్డ ఒక్కడే ఒకవైపుగా యుద్ధం చేస్తున్నాడని పేర్కొన్నారు.

మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో మీరంతా వైసీపీకి మద్దతిస్తూ వైసీపీ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధమేనా అంటూ పిలుపునిచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ధర్మాన్ని గెలిపిస్తూ విలువలు విశ్వసనీయత నిలపడానికి మీరంతా సిద్ధమేనా అంటూ కోరారు. అవినీతి జీవులు పేదల వ్యతిరేకులు పెత్తందారులను ఓడించేందుకు ఏకంగా 175కు 175 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను 25 కు 25 ఎంపీ స్థానాలను గెలిపించుకొని పేదల భవిష్యత్తుకు బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు.మీ ఓటు వల్ల మీ భవిష్యత్తుతో పాటు మీ తల రాతలు మారుతాయని జ్ఞాపకం పెట్టుకోవాలని సూచించారు. గత పది ఏళ్లలో గడచిన ఐదేళ్లు దానికి ముందున్న ఐదేళ్లు బేరీజు వేసుకొని ఎవరు మంచి చేశారు. గుర్తించి ఓటేయాలని కోరారు. మీ బిడ్డ ప్రభుత్వంలో ఏమి జరిగిందో ఒకసారి ఆలోచించాలని సూచించారు.


Similar News