Srikalahasti: భారీగా వైసీపీ ప్రచార సామాగ్రి సీజ్
చిత్తూరు జిల్లాలో భారీగా వైసీపీ ప్రచార సామాగ్రిని అధికారులు సీజ్ చేశారు...
దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల వేళ ప్రలోభాల పర్వానికి పార్టీలు తెర తీస్తున్నాయి. ఓటర్లకు నగదు, నగలు, గిఫ్టులు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. అయితే పోలీసులు, అధికారులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ప్రలోభాలను స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో తనిఖీలు చేశారు. వైసీపీ ప్రచార సామాగ్రి ఉన్నాయని ఫిర్యాదు అందింది. దీంతో రేణిగుంట విమానాశ్రయం పాత మార్గం నందు గల ఓ ప్రైవేట్ గోడౌన్, తిరుపతి శ్రీకాళహస్తి మార్గంలోని పిసిఆర్ గోడౌన్స్ ను ఆర్డీవో రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఓపెన్ చేసి తనిఖీలు చేశారు. భారీ మొత్తంలో ఉంచిన వైయస్సార్ పార్టీ ప్రచార సామాగ్రిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో రవి శంకర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలంలో గోడౌన్లో వైయస్సార్ పార్టీకి సంబంధించిన ప్రచార సామాగ్రి ఉందని ఫిర్యాదు అందిందన్నారు. అందుకు సంబంధించి అందరి ముందు గోడౌన్ ఓపెన్ చేసి తనిఖీ చేయడం జరుగిందని చెప్పారు. అన్ని కూడా వైయస్సార్ పార్టీకి సంబంధించిన ప్రచార సామాగ్రి ఉందని, అవన్నీ కూడా అభ్యర్థి,పార్టీ ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపిస్తామని ఆర్డీవో రవిశంకర్ రెడ్డి తెలిపారు.