‘తిరుపతి దుర్ఘటనకు కారణం అదే?’.. సీపీఐ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
తిరుమల(Tirumala) శ్రీవారి వైకుంఠ ద్వార టోకెన్ల జారీ సందర్భంగా బుధవారం రాత్రి తొక్కిసలాట ఘటనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పందించారు.
దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవారి వైకుంఠ ద్వార టోకెన్ల జారీ సందర్భంగా బుధవారం రాత్రి తొక్కిసలాట ఘటనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పందించారు. తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు, గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.5లక్షల వంతున పరిహారం చెల్లించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు కోసం వచ్చి.. తిరుపతి నగరం బైరాగపట్టెడలో పద్మావతి పార్క్ వద్ద భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి భౌతిక కాయాలను రుయా ఆస్పత్రి శవాగారంలో పరామర్శించి నివాళులు అర్పించారు. అనంతరం మృతుల బంధువులతో సీపీఐ రామకృష్ణ మాట్లాడారు. వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.
అదేవిధంగా తొక్కిసలాటలో గాయపడి పద్మావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఆ తర్వాత తిరుపతి కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తో మాట్లాడారు. తొక్కిసలాటకు సంబంధించిన పూర్వాపరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సలు అందించే విధంగా చూడాలని కలెక్టరుకు ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పద్మావతి వైద్యులతో మాట్లాడి చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. తొక్కిసలాటలో గాయపడిన వారికి పద్మావతి ఆసుపత్రి వైద్యులు అందిస్తున్న సేవలు బాగున్నాయని రామకృష్ణ సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం కె.రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ఎంతో పవిత్రమైన హృదయంతో దేవుని దర్శనానికి వచ్చి దుర్మరణం చెందడం బాధాకరమన్నారు. ఈ దుర్ఘటన దురదృష్టకరమన్నారు. దేవుని దర్శనం కోసం రెండు రోజులు ముందుగానే వచ్చి తిరుపతికి వచ్చి ఇలా ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగిస్తుందన్నారు. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. టీటీడీ, పోలీసు అధికారుల మధ్య సమన్వయ లోపమే ఈ దుర్ఘటనకు కారణమన్నారు. ఈ దుర్ఘటన జరగకుండా చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయన్నారు. టీటీడీ, పోలీసులు సకాలంలో సరైన చర్యలు చేపట్టక పోవడం వలన ఆరుగురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని రామకృష్ణ అన్నారు. టీటీడీ పాలక మండలి అధ్యక్షులు బొల్లినేని రాజగోపాల్ నాయుడు సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తున్నామని చెబుతున్నారని.. అదే నిజమైతే ఈ దుర్ఘటన ఎలా జరిగిందని రామకృష్ణ ప్రశ్నించారు.
సాధారణ భక్తులకు సరైన ప్రాధాన్యత లేదని భక్తులే చెబుతున్నారన్నారు. ప్రముఖులకే తిరుమలలో మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. టీటీడీ అధికార యంత్రాంగం వీఐపీల సేవలో తరిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రణాళిక బద్ధంగా వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు సామాన్య భక్తులకు అందచేసి ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. తిరుపతి దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లోపాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించాలన్నారు. తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నందున ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రామానాయుడు, రాష్ట్ర సమితి సభ్యులు డాక్టర్ జనార్దన్, తిరుపతి జిల్లా కార్యదర్శి పి.మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, తిరుపతి నగర కార్యదర్శి జిల్లా విశ్వనాథ్, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.